హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ) : ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం. వారికి అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. వచ్చే పీఆర్ఎస్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం’ అని అనేక హామీలిచ్చి ఓట్లేయించుకున్న కాంగ్రెస్.. తీరా అధికారంలోకి వచ్చాక ఎటూతేల్చకుండా కార్మికులను మోసగిస్తున్నది. విలీనంపై కార్మికులు పోరాటం మొదలుపెట్టినప్పుడల్లా ప్రతినెలా అయ్యే ఖర్చుపై లెక్కలు వేసుకుంటూ కొత్త డ్రామాలకు తెరతీస్తున్నది. తాజాగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఈ నెల 24న ‘చలో సెక్రటేరియట్’కు పిలుపునివ్వడంతో మళ్లీ ప్రభుత్వ పెద్దలు ఎప్పటిలాగే లెక్కలు వేసుకున్నారని తెలిసింది.
ఓ వైపు మహాలక్ష్మి ఉచిత బస్సు పథకానికి కూడా సుమారు రూ.2,700 కోట్ల బకాయిలు ఉండగా.. ఆర్టీసీని విలీనం చేస్తే ప్రభుత్వంపై పడే అదనపు భారాన్ని చూసి ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్టు సమాచారం. ఇప్పటికిప్పుడు వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి అపాయింటెడ్ డే ప్రకటిస్తే.. ప్రతినెలా అదనంగా 500కోట్లు అవసరమని అంచనా. అయితే ఆర్టీసీకి వచ్చే ఆదాయం ఖర్చులకే సరిపోతుండటంతో విలీన నిర్ణయాన్ని దాటవేస్తూ వస్తున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి మోస్తరుగా ఉన్న ఆర్టీసీలో.. మహాలక్ష్మి పథకం కింద ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. అప్పుడప్పుడే ఆర్థికంగా కుదుటపడుతున్న సంస్థకు ఈ పథకం ఆర్థికంగా మరింత భారమైందని ఆర్టీసీ వర్గాలే చెప్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రతినెలా రూ.350 కోట్ల వరకూ ఖర్చు అవుతుండగా, ప్రభుత్వం నుంచి అదే స్థాయిలో నిధులు ఆర్టీసీకి జమ కావడం లేదు. జీరో టిక్కెట్లు తెగినంతగా ఆర్థికశాఖ నుంచి నిధులు రాక బకాయిలు పెరుగుతూనే ఉన్నాయి. నిరుడు ఆర్టీసీకి ఆదాయం లేక, ప్రభుత్వం నుంచి బకాయిలు రాక రెండు నెలల పాటు సమయానికి వేతనాలు కూడా ఇవ్వలేకపోయారు. ప్రస్తుతం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి సుమారు రూ.2,700కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది. అంతేగాక ఒక్కో డ్రైవర్, కండక్టర్ రోజుకు 16 గంటలు విధుల్లోనే ఉండటం గమనార్హం. దీనికి తోడు ప్రయాణికుల దాడులు, పైఅధికారుల చేత తిట్లు తినాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనేది ఎప్పటినుంచో ఉన్న ఆలోచనే. అయితే, సబ్బండ వర్గాలకు ఒక ప్రణాళిక ప్రకారం న్యాయం చేసుకుంటూ వచ్చిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే జాబితాలో ఆర్టీసీ విలీన అంశాన్ని కూడా పొందుపర్చారు. అప్పటికే ఉద్యోగులకు ప్రతినెలా ఇచ్చే వేతనాలు రూ.150 కోట్ల వరకూ ఉండటం, రూ.80కోట్లు లోన్లకు, రూ.8 కోట్లు డీజిల్, పీఎఫ్‌కు, సీసీఎస్‌లకు మరో రూ.40 కోట్ల వరకు అవసరం అవుతున్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్రను గుర్తించి కేసీఆర్.. విలీనానికే మొగ్గు చూపారు. నాడు ఆర్టీసీ నుంచి వచ్చే ఆదాయాన్ని బేరీజు వేసుకున్న కేసీఆర్.. ఆర్టీసీ ఉద్యోగులను, కార్మికులను ప్రభుత్వంలో కలిపినా ఎలాంటి నష్టం ఉండబోదని నిపుణులతో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటించారు. ఆ క్రమంలోనే ఆర్టీసీ విలీన ప్రక్రియను తనే భుజస్కంధాలపై వేసుకొని ముందుకు తీసుకెళ్లారు. ఓ వైపు గవర్నర్ తమిళిసై వ్యతిరేకించినా.. ఒప్పించేలా వ్యూహాలు రచించారు.
రాష్ర్టాభివృద్ధిలో కీలకంగా నిలిచిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను.. ప్రభుత్వ ఉద్యోగులుగా చేయాలనే లక్ష్యంతో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఆగస్టులో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేస్తూ బిల్లును గవర్నర్‌కు పంపింది. ఆ సంచలనాత్మక ప్రకటనపై మొదట్లో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కొన్ని అభ్యంతరాలు తెలుపగా, బీఆర్ఎస్ పోరాటం, కార్మికుల ఆందోళనలతో బిల్లుకు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత 2023 అక్టోబర్ మొదటి వారంలోనే 30న అపాయింటెడ్ డే ఉందని కేసీఆర్ ప్రకటించారు. అయితే, అనూహ్యంగా అక్టోబర్ 18న ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అప్పటినుంచి నేటి వరకూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఆశలు అడియాసలుగానే మిగిలిపోయాయి.
కోడ్ వల్ల దాదాపు 40వేల మంది ఉద్యోగుల ‘అపాయింటెడ్ డే’ అంశం పెండింగ్‌లో పడింది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఏకగ్రీవంగా పాస్ చేయించింది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదం పొంది సెప్టెంబర్ 15న గెజిట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. కానీ, ఇప్పటి వరకు అపాయింటెడ్ డే ప్రకటించలేదు. దాని విధివిధానాలకు వేసిన కమిటీ ఇప్పటివరకు ఒక్క పని కూడా ప్రారంభించలేదు. దీంతో కార్మికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.