గద్వాల, జూలై 31 : మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుంది. శుక్రవారం జూరాలకు వరద పరవళ్లు తొక్కుతుండడంతో ప్రాజెక్టులో 24 గేట్లు ఎత్తి దిగువకు 95,592 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి సాయం త్రం 6:30గంటల వరకు 1,22,000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండండతో గేట్ల ద్వారా 95,592 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 35,502 క్యూసెక్కుల నీటిని దిగువగకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వీటితో పాటు నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 750, భీమాలిఫ్ట్-1కు 1300, భీమాలిఫ్ట్-2కు 750, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 630, జూరాల కుడికాల్వకు 600, ఎడమ కాలువకు 870, సమాంతర కాలువకు 600 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 ఉండగా ప్రస్తుతం 317.69 మీటర్ల మేర నీరు నిల్వ ఉన్నది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 కాగా ప్రస్తుతం 8.011 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్టుకు మొత్తం ఇన్‌ఫ్లో 1,22,00 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1,35,889 క్యూసెక్కులుగా నమోదైంది.