సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ): క్యూర్ పరిధిలోని అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరోసారి అవకాశం ఇచ్చింది. ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఇతర రుసుముల చెల్లింపులో 25 శాతం భారీ రాయితీని గడువును మళ్లీ పెంచింది. దరఖాస్తుదారులు ఎవరూ ముందుకు రాకపోవడం..ఖజానాను నింపుకొనే నిర్ణయంలో భాగంగా సర్కారుకు అనివార్యంగా గడువు పొడగింపునకు కారణమైంది.
ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం జీవో ఎంఎస్ నంబర్ 213 జారీ చేశారు. ఈ 25 శాతం రాయితీ సదుపాయం 2026 ఆగస్టు 01 వ తేదీ నుంచి 2026 నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఎల్ఆర్ఎస్ రుసుములు చెల్లించే ప్లాట్ల యజమానులు, దరఖాస్తుదారులు ఈ మినహాయింపును సద్వినియోగం చేసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేరొన్నారు. జీవో ఉత్తర్వుల ప్రకారం తదుపరి తగిన చర్యలు తీసుకోవాలని హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, జీహెచ్ఎంసీ కమిషనర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.