శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 04, 2020 , 01:46:48

అన్నింటా ముందు.. అందరికీ దన్ను

అన్నింటా ముందు.. అందరికీ దన్ను

  • వలసకూలీలకు బాసటగా తెలంగాణ
  • స్వస్థలాలకు పంపించడంలో చొరవ
  • కేంద్ర  సమన్వయంతో రైలు ఏర్పాటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ వేళ ఆర్తులు, ఆపన్నులకు అభయహస్తం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరిస్తున్నది. పనులు లేక ఇబ్బందులు పడుతున్న వలసకూలీలను స్వస్థలాలకు పంపించడానికి కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకొన్నది. ప్రత్యేక రైలును ఏర్పాటుచేయించి సుమారు 1200 మందిని సొంత ప్రాంతాలకు తరలించింది. లాక్‌డౌన్‌ వల్ల పనులు కోల్పోయిన వలస కూలీలకు ఇబ్బందులు ఎదురవకుండా షెల్టర్‌ హోంలను నెలకొల్పడమే కాకుండా.. బియ్యం, నగదును అందించి అక్కున చేర్చుకొన్నది.  పనులు లేక అల్లాడిపోతున్న వలసకూలీలను వారి స్వస్థలాలకు పంపించడానికి కేంద్రంతో సంప్రతించింది. కేంద్రం అంగీకరించిన వెంటనే ప్రభుత్వ యం త్రాంగం రంగంలోకి దిగింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌.. ఇతర ఉన్నతాధికారులు అర్వింద్‌కుమార్‌, సందీప్‌కుమార్‌ సుల్తానియా, సునీల్‌శర్మ, జితేందర్‌తో కలిసి చర్చించి కార్యాచరణ రూ పొందించారు. రైల్వే అధికారులతో మాట్లాడి ప్రత్యేక రైలును సిద్ధంచేశారు. మరోవైపు స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమైన వలసకూలీలకు స్క్రీనింగ్‌ టెస్ట్‌లు పూర్తిచేసి 50 బస్సుల్లో లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు తీసుకొచ్చి, ప్రత్యేక రైల్లో పంపించారు. ఈ కూలీల్లో ఎక్కువమంది కందిలోని ఐఐటీ భవన నిర్మాణంలో పాలుపంచుకొన్నవారే. ఆ తరువాతే వలస కూలీలకోసం ప్రత్యేక రైళ్లు నడిపించాలని కేంద్రం నిర్ణయం తీసుకొన్నది. తెలంగాణ నుంచి బయలుదేరిన కూలీలకు భోజన సదుపాయం కల్పించింది. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద రెవెన్యూ, పోలీస్‌, వైద్యాధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి.. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం స్క్రీనింగ్‌చేసి ఎటువం టి అడ్డంకులు లేకుండా వలస కూలీలను సురక్షితంగావారి స్వస్థలాలకు చేరుస్తున్నది. అన్నింటా ముందస్తు చర్యలు తీసుకొంటూ.. అందరికీ దన్నుగా నిలుస్తూ.. తెలంగాణ ప్రభుత్వం దేశానికే మార్గదర్శకంగా నిలిచింది. 


logo