Crop Loans | హైదరాబాద్ : ఈ నెల 30న రెండో విడుత రుణమాఫీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అసెంబ్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రెండో విడతలో భాగంగా రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల వరకు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనుంది.
తొలి విడుత రుణమాఫీలో లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ లక్ష లోపు రుణాలు ఉన్న చాలా మంది రైతులకు మాఫీ కాలేదు. ఏదో ఒక నిబంధన పేరుతో రుణాలు మాఫీ కాకపోవడంతో రైతాంగంలో గందరగోళం నెలకొన్నది. లక్షలోపు రుణాలన్నీ మాఫీ చేసినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. దాదాపు సగం మంది రైతులు తమకు జరగనే లేదని అంటున్నారు. రెండో విడతలో జులై నెలాఖరులోపు లక్షన్నర వరకు మాఫీ చేస్తం. ఆగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తం. నేను విదేశాలకు వెళ్లి వచ్చిన వెంటనే రుణమాఫీ పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కల్వకుర్తిలో జరిగిన సమావేశంలో చెప్పడంతో అనుమానాలు మరింత తీవ్రమయ్యాయి.
అసలు సీఎం విదేశీ పర్యటనకు, రుణమాఫీ అమలుకు సంబంధం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. మరోసారి రుణమాఫీ గడువు మారుతున్నదా అనే చర్చ జరుగుతున్నది. ఎన్నికలకు ముందు డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ తేదీ మారిపోయింది. మొదట్లో ఆ హామీని కాంగ్రెస్ సర్కార్ అటకెక్కిస్తున్నదన్న ప్రచారమూ సాగింది. ‘ఆగస్టు 15లోపు రుణమాఫీ సహా గ్యారెంటీలన్నీ అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా..?’ అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసరడంతో.. రేవంత్‌రెడ్డిపై ఆ ఒత్తిడి బలంగా పనిచేసింది. దీంతో ఆగస్టు 15 నాటికి రుణమాఫీ పూర్తిచేస్తామని రేవంత్ ప్రకటించాల్సి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించిన అన్ని సభల్లోనూ ఆగస్టు 15 లోపు రుణమాఫీపై దేవుళ్లందరి మీద రేవంత్ ఒట్లు పెట్టారు. తాజాగా కల్వకుర్తి సభలో మాత్రం ఆగస్టు 15 అని అనకుండా ఆగస్టులోగా చేస్తామంటూ నర్మగర్భపు వాఖ్యలు చేశారని, దీని వెనుక ఏదో మర్మం ఉన్నదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తాను 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని, తిరిగి రాగానే మొత్తం రుణమాఫీ చేస్తానంటూ సీఎం చేసిన ప్రకటనపై నిపుణులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. విదేశీ పర్యటనకు రుణమాఫీ పూర్తికి సంబంధమేమిటని ప్రశ్నిస్తున్నారు. 14న వస్తే 15లోగా రుణమాఫీ చేయవచ్చు కదా అని సందేహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..