మంచిర్యాలటౌన్, మార్చి 1 : ‘తమకు సరిపడా తిండి పెట్టడం లేదు. పనులన్నీ మాతోనే చేయిస్తున్నరు’ అంటూ ఆదివారం ఉదయం మంచిర్యాలలోని సాయికుంట ప్రభుత్వ బీసీ సమీకృత బాలుర వసతిగృహంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐఎస్బీ)జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల సన్నీగౌడ్ మాట్లాడుతూ.. హాస్టల్ సిబ్బంది విద్యార్థులతో ఉదయం ఐదు గంటల నుంచే పనులు చేయిస్తున్నారని, అల్పాహారం తయారీ మొదలుకొని, స్టోర్నుంచి బియ్యాన్ని వంటగదికి మోసుకెళ్లడం, కూరగాయలను తరిగించడం లాంటి పనులు ఎన్నో చేయిస్తున్నారని మండిపడ్డారు.
విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టకపోవడంతో పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. హాస్టల్ ఆవరణ అంతా అపరిశుభ్రంగా ఉందని, తలుపులు సరిగా లేవని, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే లేరని మండిపడ్డారు. ప్రభుత్వ సమీకృత బీసీ బాలుర హాస్టల్లో జరుగుతున్న తతంగంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హాస్టల్ విద్యార్థులతో పనులు చేయిస్తున్న సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.