PM CARES Fund : ప్రధానమంత్రి సహాయనిధి (పీఎం కేర్స్ ఫండ్)లో రూ.8,452 కోట్ల నిధులు ఉండగా, అందులో రూ.87.85 లక్షల నిధులు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 0.01 శాతం. ఈ విషయం తాజాగా జరిగిన ఆడిట్ సందర్భంగా కేంద్రమే వెల్లడించింది. 2023-2024, 2024-2025 సంవత్సరాలకు సంబంధించి పీఎం కేర్ ఫండ్ వివరాల్ని ప్రభుత్వం వెల్లడించింది. అంటే, ఆదాయం, వ్యయం సహా వివరాల్ని ప్రకటించింది. 2022-2023 తర్వాత రెండేళ్లుగా ఈ నిధులకు సంబంధించిన వివరాల్ని ప్రభుత్వం ప్రకటించలేదు.
ఈ ఆడిట్ నివేదిక ప్రకారం.. 2024-25లో పీఎం కేర్ ఫండ్ ఆదాయం రూ.1,279.9 కోట్లుగా ఉంది. అంటే, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 41 శాతం పెరుగుదల ఉంది. అయితే, విరాళాలు మాత్రం తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.480 కోట్ల విరాళాలు మాత్రమే వచ్చాయి. మొత్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.8,452 కోట్ల నిధులు ఉండగా, ఇందులో రూ.87.85 లక్షలు (0.01 శాతం) మాత్రమే ఖర్చు చేశారు. భారీగా నిధులు ఉన్నప్పటికీ ఇంత తక్కువగా ఖర్చు చేయడాన్ని సమాచార హక్కు చట్టం కార్యకర్త అంజలి భరద్వాజ్ ప్రశ్నించారు. ఇదే సమయంలో ఈ వివరాల్ని తరచూ ప్రకటించకపోవడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. పీఎం కేర్స్ ఫండ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ 2020 మార్చిలో తొలిసారి ప్రారంభించారు. అప్పట్లో కోవిడ్ సందర్భంగా తలెత్తిన విపత్తును ఎదుర్కొనేందుకు విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుతూ ప్రధాని దీన్ని ప్రారంభించారు.
Finally the audit statement of PMCARES Fund for 2024-25 has been made public! Key highlights-
-Utilised only 0.01% of available ₹ 8,452 crore! Why is the PMCARES Fund keeping such large sums of money idle?
-324 crore was refunded by implementing agencies- but no info on what… pic.twitter.com/4wgrZc0c8r— Anjali Bhardwaj (@AnjaliB_) August 18, 2026
కోవిడ్ వంటి విపత్తులు వచ్చినప్పుడు వీటిని వాడుతామన్నారు. దీనికి భారీ స్పందన వచ్చింది. మొదటి మూడేళ్లలోనే రూ.13,000 కోట్ల నిధులు విరాళంగా వచ్చాయి. అందులో పీఎం కేర్స్ ప్రారంభించిన మొదటి వారంలోనే రూ.3,000 కోట్లు విరాళంగా వచ్చాయి. అయితే, ఈ నిధుల ఖర్చు గురించి ప్రభుత్వం సరైన వివరాలు ప్రకటించలేదు. దీనిపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. ఇది ప్రభుత్వ సంస్థ కాదని, దీనిపై వివరాల్ని సమాచార హక్కు చట్టం ప్రకారం ఇవ్వలేమని తెలిపింది. దీన్ని అంజలి భరద్వాజ్ ప్రశ్నించారు. చివరకు ప్రభుత్వం వివరాల్ని వెల్లడించింది.