‘నమస్తే తెలంగాణ-ముల్కనూరు సాహితీపీఠం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2026’లో ప్రత్యేక బహుమతి రూ.5 వేలు పొందిన కథ.
“నా యనా!”
“ఊ!”
“అమ్మ కాడలు తెమ్మంది”
“గుర్తుందిలేరా! నీకేమో సముద్రం యావ. మీ అమ్మకేమో తామరతూళ్ల తొక్కు పిచ్చి!” బారుగా నవ్వాడు సుబ్బన్న.
తండ్రి అలా నవ్వినప్పుడల్లా ఆ కొలనులో ఇంకో కమలం విరిసినట్లనిపిస్తుంది చేతన్‌కు.
అల్లంత దూరంలో ఎర్రకాళ్ల కొంగ ఒకటి చేపపిల్లను టక్కున ముక్కున కరచిపట్టుకొచ్చి గొంతులోకి లాగేసుకుంది.
“నాయనా! ఇటు చూడు. ఈ కొంగ చేప్పిల్లనెట్లా మింగుతుందో!”
“ఆఁ… ఆఁ… అచ్చం ఆ పోలారం డ్యాం ఊళ్లను మింగినట్టుందిరా!”
“అవున్నాయనా! సరే… బస్తా నిండిందిగా… ఇక రా పోదాం”
“ఇంకొద్దిసేపు ఓపిక పట్టు తండ్రీ. ముక్కోటి మూడ్రోజులే ఉంది. వెయ్యాకుల ఆర్డరు. పదీ ఇరవై పక్కన పెడతన్నా. నీకా డబ్బుల్తో సముద్రం చూపిస్తా… గ్యారంటీగా” కొడుకును బతిమాలుకున్నాడు సుబ్బన్న.
‘సముద్రం’ అనే శబ్దం హిమశిఖరాల నుండి గంభీరంగా వెలువడే ఓంకార నాదంలా మోగింది.. ఆ చిన్నారి గుండెల్లో. అల్లరిమాని గమ్మున చెరువొడ్డుపై కూర్చున్నాడు.
అది ప్రభాత వేళ. ‘పేరంటాలమ్మ కుంట’ అనే ఆ చెరువుపై నీరెండ పడుతుంటే.. అందులో వందల కమలాలు నిటారుగా లేచి సూర్యనమస్కారాలు చేస్తున్నట్లుగా మెరుస్తున్నాయి. వాటి మధ్య సుబ్బన్న నల్లటి దేహం కూడా భలే గమ్మత్తుగా మెరుస్తోంది. కుకునూరు దాటిన తర్వాత కనిపించే ఆ చెరువులో తామరాకులు కోసి, చుట్టుపక్కల ఊళ్లలో అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆ ఆకుల్ని ఇటు భద్రాచలం నుండి అటు రాజమండ్రి వరకూ అక్కడక్కడా కొన్ని గుళ్లల్లో ప్రసాదం పెట్టించేందుకు వాడతారు. సుబ్బన్న అతికష్టం మీద రోజుకు నాలుగొందల వరకూ సంపాదిస్తాడు.
ఈ మధ్య ఆలయాల్లో ప్లాస్టిక్ నైవేద్యం కప్పులు, కృత్రిమ విస్తళ్లకు ఆదరణ పెరిగి.. ఆకులు, ఆకు విస్తళ్లకూ గిరాకీ బాగా తగ్గిపోతోంది. అందుకే తామరాకులతోపాటే పూలనూ సేకరించి పండుగ రోజుల్లో అంతకో ఇంతకో అమ్ముకుంటూ బతుకు నావను ఏదోవిధంగా లాగిస్తున్నాడు సుబ్బన్న. చేతన్.. అతని ఏకైక మురిపాల ముద్దుబిడ్డడు.
ఎర్రకాళ్ల కొంగ ఇంకో చేపపిల్లను ముక్కునపట్టి చేతన్ పక్కనే వాలింది.
భుజం మీద ఆకులసంచితో వొడ్డుకొచ్చి సేదతీరుతున్నాడు సుబ్బన్న.
“నాయనా! ఈ కొంగలు ఎక్కడినుండి వస్తాయి?”
“చానాదూరం నుండి. ఎన్నో దేశాలు దాటి వస్తాయంట”
“నాకంటే ఈ కొంగే నయం మరి!”
“ఎందుకంటా?”
“అది సముద్రమ్మీద ఎగురుకుంటూ వస్తది”
“ఆర్నీ దుంపతెగా! అటుతిరిగి ఇటుతిరిగి సముద్రం దగ్గరకే పోతుంది కదరా నీ బుర్ర. అది తప్ప నీకింకేమీ తట్టదా తండ్రీ?”
“నీకీ చెరువుతప్ప ఇంకేం పట్టదా మరి? సముద్రం చూపీవా నాకు… చూపీవా… చూపీవా?” అంటూ గోలచేస్తూ తండ్రి భుజం మీద గుద్దుతూ మారాం చేయసాగాడు.
“అయ్యో! ఆగరా చేతనా ఆగు. ఈ చెరువుమీదేగా మన బతుకులు. ఈ ఆకులేగా మనకు మెతుకులు. బింకంమాని ఇట్రా బిడ్డా.. ఆకులు పేరుద్దాం” అంటూ వాటిని పసిరికతో మెరుస్తున్న చెరువుగట్టుపై పోస్తూ సంతోషంగా నవ్వాడు.
నవ్వుతూనే పాటందుకున్నాడు. చిన్ననాడెప్పుడో విన్న ఓడ సరంగు సూరితాత నోటిపాట. నేటి తన బతుకుబాట!
నీటిని నమ్మి ఏలేలో – నేల ఉన్నదీ హైలేసా
నేలను నమ్మి ఏలేలో – చెట్టు ఉన్నది హైలేసా
చెట్టును నమ్మి ఏలేలో – కొమ్మ ఉన్నదీ హైలేసా
కొమ్మను నమ్మి ఏలేలో – పువ్వు ఉన్నదీ హైలేసా
పువ్వును నమ్మి ఏలేలో – నేనున్నాను హైలేసా
నన్ను నమ్మి ఏలేలో – నువ్వున్నావు హైలేసా!
కమ్మని తండ్రిపాట పూర్తవగానే ఠక్కున ప్రశ్నల బాణాలు వదిలాడు చేతన్. స్ఫురద్రూపి. మహా బుద్ధిశాలి వాడు.
“నాయనా! నిన్ను నమ్మి ఏలేలో – నేనున్నాను ఏలేలో. రోజూ పాడతావుగానీ, నేను నిన్ను నమ్మానా? లేదా? చెప్పు?”
“నమ్మావు… ఐతే?”
“నమ్మినోళ్లని మోసం చేయొచ్చా?”
“చెయ్యొద్దు… ఐతే?”
“నువ్వు రోజూ ఆశపెడతావు. నమ్మిస్తావు. ఐనా సముద్రం చూపివ్వమంటే తప్పించుకుంటావ్”
“అయ్యయ్యో రామ రామ! నీ సముద్రం ఎర్రి బాగా ముదిరి పోయిందిరోయ్” అంటూ గుడ్లెర్రజేసాడు సుబ్బన్న.
చేతన్ అలిగి అటుతిరిగి కూర్చున్నాడు.
మధ్యాహ్నం వేళకు తామరాకుల్ని చక్కగా కట్టలుగా పేర్చి, నారతీగెలతో కట్టి తన పాత మోపెడ్ మీద వేసుకుని బయల్దేరాడు సుబ్బన్న. చేతన్ అయిష్టంగా, నీరసంగా బుంగమూతి పెట్టి బండెక్కాడు. సముద్రాన్ని చూడాలని, దాని సమున్నత కెరటాల నురగలతో ఆడుకోవాలనే ఆ చిన్నారి కోరిక నానాటికీ జ్వాలామానమై అతనిలో
రగులుకుంటోంది.
“మన భూమిపై డెబ్భయ్ శాతంపైగానే జలభాగం ఉన్నది. ఎక్కువ భాగం సముద్రాలు, మహాసముద్రాలే వ్యాపించి ఉన్నాయి. ఈ జలరాశిని ఐదు మహాసముద్రాలుగా విభజించారు. పసిఫిక్ మహా సముద్రం అన్నిట్లోకి…”
“సార్!”
రంగురంగుల అందమైన ప్రపంచపటం చూపిస్తూ ఆ బడిలో మిగిలిపోయిన ఇరవైమంది తెలుగు మీడియం పిల్లలకు పాఠం చెప్తున్నాడు గోవర్ధన్ మాస్టారు. ‘సార్’ అన్న కేకతో ఆ వైపు తిరిగాడు. అది చేతన్.
“సముద్రం చూడాలంటే ఎలా సార్?”
“మ్… ఏముందిరా. అగో అటు చేల గెట్లమ్మట బడి మూడొందల కిలోమీటర్ల బారు నడుచుకుంటూ పోరా! ముందు విజయవాడ, తర్వాత బందరు వచ్చేస్తాయ్. నువ్వలా బందరులో కాలు పెట్టావో లేదో.. సముద్రం నీకెదురొచ్చి స్వాగతం పలుకుతుందిరా వీర చేతనా” అని ఫెళ్లున నవ్వాడు గోవర్ధన్ మాస్టారు.
పిల్లలంతా చేతన్ వైపు తిరిగి గోలగా నవ్వారు. వాడు తల వాల్చేసాడు.
చేతన్ చిన్నబుచ్చుకున్నాడని గ్రహించాడు మాస్టారు. స్కూలు వదిలిన తర్వాత వాడిని తన బండెక్కించుకుని తిన్నగా వాళ్లింటి ముందు ఆపాడు. సుబ్బన్న, భార్య రాధమ్మ ఇంటి ముందే కూర్చొని ఉన్నారు.
“సుబ్బన్నా! మీవాడికి ఓసారి సముద్రం అంట చూపించవయ్యా. రోజూ వాడికదే సోయి. వైజాగంటే దూరం. అటు బందరో, ఇటు అంతర్వేదో తీసుకెళ్లి వాడి కోరిక తీర్చు. సముద్రాన్ని చూసిందాకా వీడెవడ్నీ నిద్రపోనిచ్చేలా లేడు” అని నవ్వుతూ చేతన్‌ను దింపి వేగంగా వెళ్లిపోయాడు.
“వార్నీ పిల్లోడా! బళ్లో కూడానా నీ గోల? ఎండాకాలం సెలవల్లో వెళ్దాంలేగానీ, పొద్దాక ఆ సముద్రం జపం మానరా బాబూ” అంటూ గదమాయించాడు సుబ్బన్న.
“నిజంగా సెలవల్లో సముద్రం చూపిస్తావా నాయనా?”
“అబ్బబ్బా నీ పిచ్చిగోల! చూయిస్తాడ్లేగానీ అలా అస్తమానం పీడించకు కన్నా. ఇగో ఇట్రా. తెల్లుల్లేసి తామర తూళ్ల పచ్చడి తొక్కానీరోజు. దా… కమ్మగా రెండు ముద్దలు తిందువుగానీ” అంటూ కొడుకును గోముగా ముద్దుజేస్తూ దగ్గరికి తీసుకుంది రాధమ్మ.
ఆ రాత్రంతా వేసవి రాకకోసం పడిగాపులు కాసే ఉత్తరధృవపు వలసపక్షిలా.. తన ప్రయాణం గురించి ఎన్నో కలలు కన్నాడు ఆ చిన్నవాడు.
ఆ యేడు వేసవి సమీపిస్తున్నకొద్దీ విశాల నీలిసంద్రాన్ని వీక్షించాలనే చేతన్ కోరిక.. అడవిగుట్టలో అంటుకున్న చండ్రమానులా ఇంకా ఇంకా జ్వలించసాగింది. ఆ సముద్రమే వాడి ఆకలి, దప్పిక కూడా! సముద్రం వాడి పగటి పలవరింత. రాతిరి కలవరింత.
అసలు చేతన్‌కు సముద్రం మీద అంత ఇష్టం కలగడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? అది ఒక శంఖు! వాడి ప్రియనేస్తం శంకర్గాడి శంఖు. శంకర్ తాత ఆమధ్య యాత్రలకెళ్లి వచ్చాడు. వస్తావస్తా మనవడికో చక్కని సముద్ర శంఖుని బహుమతిగా కొనితెచ్చాడు.
ఒకరోజు పొద్దున్నే శంకర్ తాత ఆ శంఖువుని మనుమడి చెవికానించి పెట్టి..
“వినరా ఇది బుజ్జోడా.. ఇది విను” అంటూ తన పక్కన కూచోబెట్టుకున్నాడు.
ఆ శంఖు నుండి వినిపిస్తున్న హోరుని విని ఎంతో అబ్బురపడ్డాడు శంకర్.
“ఓ తాతా! భలేగుంది… ఈ సౌండు. ఏంటిది?”
“అదా… ఘోష నాయనా ఘోష! లోకానిది! మన తాత ముత్తాతల అస్తికల్ని మోసుకెళ్లే నదులు.. వాళ్ల ఆత్మల్ని కూడా సముద్రంలో నిమజ్జనం చేస్తాయంట! ఆ ఘోషల్ని సముద్రం తీసుకొని ఈ శంఖువుల నుండి తిరిగి మనకు వినిపిస్తుందట. నిజమో, పుక్కిటి పురాణమోగానీ మా నాయనమ్మ మాకు చెపుతా ఉండేది” అంటూ తాత్వికంగా చెప్పాడు శంకర్గాడి తాత.
శంకర్ ప్రతి వేకువజామున ఆ శంఖాన్ని చెవిదగ్గర పెట్టుకుని దాని నుండి వెలువడే సవ్వడిని వింటూ తెగ అచ్చెరువొందేవాడు.
ఒకరోజు శంకర్ తన శంఖువుని బడికి తెచ్చాడు. తెచ్చి తన దోస్తుకు చూపించడమే కాదు.. ఆ శంఖపు అదృశ్య కంఠ నాళాలనుండి వెలువడుతున్న ఆ నాదఘోషనూ చేతన్‌కు వినిపించాడు. ఆ హోరు విన్నంతనే అది ఓ అద్భుత తరంగ ప్రవాహంలా అతని దేహాత్మల నిండా కమ్ముకొన్నది.
“అబ్బ శంకర్. ఏంట్రా ఇది? అబ్బ! ఎంత బాగుందిరా ఈ సౌండు!” అని బిగ్గరగా కేకలేసాడు.
“సౌండు కాదురా.. నా పిచ్చి ఫ్రెండూ!” అంటూ వయ్యారంగా తన మూతిని తిప్పుతూ రాగాలు తీసాడు శంకర్.
“మరి?”
“అది ‘గోస’ అంటరా… గోస! మన తాతముత్తాతల గోసంట! మా తాత చెప్పాళ్లే!”
“రేయ్ శంకరూ!”
“ఊఁ”
“నిజమేరా శంకర్! ఇందులో మా తాత గొంతుకూడా నాకు వినిపిస్తున్నట్లే ఉందిరా! మా తాతరా… మా తాత. తాత ఏడుస్తున్నట్లుందిరా. నీకు తెలుసు కదరా. మా తాత ఊరు కూడా పోలవరం ముంపులో పోయిందిరా. ఆరోజు… అమ్మా, నేనూ తాతింట్లోనే ఉన్నాం. ఊరు ఖాళీచేసి పోవాలని చాటింపేస్తున్నారు. ఆ డప్పుమోత అలా ఆగిందో లేదో.. మా తాతగుండె కూడా…” అంటూ ఆ శంఖుహోరుని వింటూనే వాళ్ల తాత.. తమ తాత ముత్తాతల నాటి పుట్టినూరుని వదలిపోలేక మనేదితో ఎలా చనిపోయాడో తన ప్రియనేస్తానికి చెపుతున్నాడు చేతన్. పెంచిన గోదారమ్మే తమను ముంచుతుందని తాత నిశిరాత్రుళ్లు గుండెలు బాదుకుని విలపించేవాడట. ఉన్న ఒక్క కొడుకూ అన్నల్లోకి చేరిపోయాడు. చేతన్ తల్లి.. తండ్రిని వాళ్లింటికొచ్చి ఉండుమని ఎన్నోసార్లు మొరపెట్టుకుంది. ఐనా తను చస్తే గోదారిగట్టున తన చేలోనే చస్తానని రానేరాలేదు. ఇదంతా శంకర్‌కు చెప్తూనే ఒక్కసారిగా బావురమని రోదించసాగాడు.

స్నేహితుని ఊరడింపుతో మనసు తేటపడినాక జిజ్ఞాసగా అడిగాడు.
“శంకర్… ఈ శంఖులో నుండి వచ్చే శబ్దం సముద్రంలో కూడా వస్తుందా?”
“ఇంకా బాగా వినిపిస్తుందంట. తాత చెప్పాడు”
“ఐతే నేను సముద్రం దగ్గరికి వెళ్తారా”
“సరే… మరి మీ నాయన్ను అడగరా” అంటూ చేతన్ చేతిలోని తన శంఖువుని తీసుకుని వెళ్లాడు శంకర్.
ఆ రోజునుండి మొదలు! సముద్రాన్ని చూడాలనీ, దాని ఒడ్డున కూర్చొని సాగరఘోషల్ని వినాలనే కాంక్ష ఆ పసిగుండెలో ముందు ఓ చెకుముకి రవ్వయి… జ్వాలగా మారి… అది వాడిలో ప్రతి అణువులో ఓ కార్చిచ్చులా పెరిగి రగులుతోంది.
అవి నవరాత్రుల వేడుక దినాలు. ఈసారి అనుకోకుండా రాజమండ్రి నుండి కూడా అమ్మవారి గుళ్లనుండి కొన్ని ఆర్డర్లు రావటంతో సుబ్బన్నకు తామరాకులు, పూలకు గిరాకీ పెరిగింది. పదుగురి భక్తి పేదలకు భుక్తి కదా!
సుబ్బన్న ఒకరోజు బుట్టలు తీసుకుని బయల్దేరాడు. తనూ వెంట వస్తానని మారాం చేశాడు చేతన్. అసలే వాడిది ఉడుము పట్టు. చేసేదిలేక వాడినీ తనతో తీసుకెళ్తున్నాడు. వీఆర్‌పురం మీదుగా పోచవరం వెళ్లి లాంచీ పట్టుకుని పేరంటాలపల్లిలో దిగాలి. అక్కడ మళ్లీ లాంచీ మారి పురుషోత్తం పట్నం వరకూ వెళ్లి.. అక్కడి నుండి రాజమండ్రికి చేరాలి.
లాంచీ ముంపు గ్రామమైన దేవీపట్నం దాటి పురుషోత్తంపట్నం సమీపిస్తుండగా.. సందెపొద్దుల నీరెండ కిరణాలు తన మేనిపై తళతళ పడుతుంటే.. వెండి అలల అల్లికలతో సుందర జలచిత్తరువులు గీసి చూపుతోంది గోదారమ్మ. ఆ అందాలను మైమరచి చూస్తున్న చేతన్ కళ్లకు అల్లంత దూరంలో పెద్దగా పోలవరం డ్యాం కనిపించింది. అటే చూస్తూ మనేదిగా తాతను, నిర్జనమై.. సమాధులు, గబ్బిలాలు మాత్రమే మిగిలిపోయిన తాత ఊరినీ గుర్తుచేసుకున్నాడు. వాడి లేతచెక్కిళ్ల మీదుగా కన్నీరు బొటబొటా జాలువారింది. బేలగా తండ్రిని అడిగాడు.
“నాయనా… సముద్రం మీద కూడా వంతెనలు కడతారా?”
“ఎందుక్కట్టరు? సముద్రం మీద వారధి కట్టేగా రాములోరు లంకకెళ్లింది”
“ఎందుకు నాయనా?”
“రావణాసురుణ్ని చంపెయ్యటానికి”
“నాయనా… అదేగా పోలవరం వంతెన?”
“ఊఁ”
“దానిమీద కూడా రాములోరొస్తారా?”
“ఎర్రి కన్నా! ఇప్పుడు ఆయనెందుకురా రావటం?”
“తాసీల్దారు మనుషుల్ని సంపెయ్యటానికి!”
“ర్రేయ్… ఏంట్రా పిచ్చెక్కిందా నీకు ఎదవా? ఏంటా ఆలోచనలు? మీ మామయ్యలా దళంలో చేరిపోతావా ఏం?” అంటూ ఉగ్రుడై గద్దిస్తూ, కొడుకు చెవులను గట్టిగా మెలిపెట్టాడు సుబ్బన్న.
“తాతయ్య ఇల్లు, పొలం లాగేసుకుంది వాళ్లేగా! అమ్మ చెప్పింది”
“చాల్లే నోర్మూసుకో! దవడలు పేలతాయి. కొన్ని తప్పవంతే. ప్రాజెక్టు కోసం… అందరికీ నీళ్లు పారొద్దా? ఇవన్నీ చెప్పటానికి మీ అమ్మకు బుర్రలేదు… ఇంటానికి నీకు బుద్ధిలేదు” అంటూ మళ్లీ గుడ్లురిమాడు.
“ఐతే రాములోరు రాడా?”
“ఆయన రాడ్రా రాడు. రానేరాడు. మనలాంటోళ్ల కోసం అస్సలేరాడు! అక్కడే భద్రాద్రి గుట్టమీద భద్రంగా ఉంటాడు… అదంతే!” అంటూనే ఒక్కసారిగా తనూ తీవ్ర భావావేశానికి గురయ్యాడు సుబ్బన్న.
ఈ మధ్యనే గుండె ఆగి చనిపోయిన మామగారు, అప్పట్లో కళకళలాడుతుండే అత్తిల్లు, గోదారి గట్టెమ్మట ముత్యంలా మెరుస్తూ ఉండే ఆ ముంపుగ్రామం, ఆ యేర్లూపైర్లూ గుర్తొచ్చి అతని కన్నులు కూడా ఒక్కసారిగా కన్నీటి కడవలైనాయి.
ఆ సుబ్బన్న మామగారి ఊరే గాదు. ప్రతి ముంపు గ్రామమూ నిర్జన నిర్మానుష్య ఏకాంతదీవిలా మిగిలింది. అక్కడి ఆలయాలు సైతం గబ్బిలాల కొలువులై పోయాయి. ఇప్పుడక్కడ ఏ పూలతీగా పూయట్లేదు. ఏ లేగదూడా ఆడట్లేదు. శోకాలతో తమ పుట్టినూళ్లను వదలి కదలిపోయిన మనుషులకోసం.. మానులూ మనేది పడుతున్నాయి. నిశిరాత్రుల్లో కూడా అక్కడి అడవి పక్షులు దూరంగా పునరావాస కాలనీలకు తరలిపోయిన తమ ఆదివాసీ నేస్తాలకోసం మిణుగురుల వెలుగుల్లో ఇంకా వెతుక్కుంటున్నాయి.
లాంచీ పురుషోత్తంపట్నం చేరుకుంది. దిగగానే గండి పోచమ్మ తల్లికి దండాలు పెట్టుకుని రాజమహేంద్రికి బయల్దేరారు తండ్రీకొడుకులు.
వేసవి వెచ్చగా పూయనే పూసింది.
అగ్నిపత్రాలు రాసే గ్రీష్మం సాగిపోక మునుపే.. మాట తప్పకుండా సముద్రం చూపించటానికి కొడుకుని భీమిలి తీరానికి తీసుకెళ్లాడు సుబ్బన్న.
సముద్రం ఆ రోజు పోటుమీదుంది. సాగరతీరాన్ని సమీపిస్తుండగా చేతన్లోని ప్రతి జీవాణువులో వేల చక్షువులు విప్పారినట్లయింది. అమిత సంభ్రమాశ్చర్యాలతో ఆ నీలిసంద్రాన్ని నోరెళ్లబెట్టి చూడసాగాడు.
అది సముద్రం… భూమిని తమకంతో ఏనాడో అల్లుకుని విడువని మోహసర్పం ఆ సంద్రం. సురాసురులకు పాలకడలై విషామృతాలను పంచిన సంద్రం. పురుగులకు సమాధులు కట్టి మేలి ముత్యాలు పండించే సంద్రం. సృష్టి రహస్యాల్ని కడుపులో మోసే సంద్రం. దిగంతాలకు పొలిమేరలు గీసే సంద్రం. గగనసఖితో అనంత రతుల గూడి వర్షశిశువుల్ని కనే ఈ సంద్రం! అనంత భగ్న హృదయ ఘోషల్ని లక్షల శంఖువుల గళాలనుండి చారుకేశీ ఆలాపనలుగా పలికించే సంద్రం. తననెంతో మోహించే తీరాల గుండెల్ని మాత్రం తుఫానులతో పగలగొట్టే నిర్దయహృది ఈ సంద్రం. వలస రాకాసులకు రాదారులు వేసిన సంద్రం. దొరలకు నెనరుతో చమురులు పంచే సంద్రం. ఒక్క పేదగొంతుక దాహాన్ని తీర్చలేని సంద్రం! కోట్లకొద్దీ చేపల్ని సాకే సంద్రం. కాలుష్య పాపాల్ని మోసే సంద్రం. గుట్టలుగా ఉప్పునీ, గుట్టుగా నిప్పునీ దాచే ఈ సంద్రం… ఈ సంద్రం… నీదిగాదు… నాదిగాదు… ఎవడిదీ గాదు! కానీ, అది ఈనాడు ఆ చిన్నవాడిదయింది!
ఔను! నిజంగానే! సముద్రం నేడు చేతన్ సొత్తయింది. వాడు తన గుండె గుప్పిట్లోకి సముద్రాన్ని ఒడిసి పట్టుకున్నట్లుగా అనుభూతి చెందాడు. స్వచ్ఛమైన అలౌకిక ఆనందం వాడిది.
ఆద్యంతాలు అంతుచిక్కని ఆ అలల్ని ఆవాహన చేసుకున్నట్లు, వాటి పాల నురగలపై తేలియాడుతున్నట్లున్న ఆ బాలుడు నేడు క్షీరసాగర శయనుడు! బాలకృష్ణుడంటి ఆ బాలకునికి కడలి ఓ కాళింది మడుగులా తోచింది. పైన పెద్దమ్మలా గగనవీధి. ముంగిట చిన్నమ్మలా ఆ పయోనిధి!
“ఓ సంద్రమా! ఈ నీ ఘోష ఎక్కడినుండి వస్తోంది. శంకర్ తాత చెప్పినట్లు అది జీవులన్నిటి ఆత్మఘోషనేనా? ఆ ఘోషను లక్షల శంఖువుల్లోకెలా నింపుతావు?” అని ఆ సముద్రాన్ని ఇంకేవేవో అడగాలనే ఆరాటం చేతన్‌ది. వాడిలో భావం ఉంది. కానీ, భాష చాలట్లేదు.
సాగరతీరాన అలా దొర్లుతూ పొర్లుతూ తన కేరింతల మధ్య పైన ఎగురుతున్న పక్షులను, అంత దూరంలో వలలు విసురుతున్న జాలర్లను పొలికేకల్లాంటి అరుపులతో పిలుస్తున్నాడు. తడిసి తడిసి వాడి దేహం ఓ ఉప్పుగిన్నెలా తెల్లగా మెరుస్తోంది. అంతలోనే అటువైపున నాలుగైదు చేపలు గాలిలోకి మిలమిలమని లేచి వెంటనే బుడుంగుమని మళ్లీ నీటిలోకి దుముకుతుంటే చూసిన చేతన్ పరవశంతో ఆడుతూ..
“అగో చేపలు… చేపలు…!” అంటూ ముందుకు ఉరికాడు.
“ఒరేయ్ నాయనా! జాగ్రత్తరా జాగ్రత్త. ఇంకా లోపలికి పోవద్దు” అంటూ దగ్గర్లో పెద్ద బండరాయిపై కూర్చొని కొడుకు ఉల్లాసాన్ని గమనిస్తూ ఉన్న సుబ్బన్న హెచ్చరించాడు.
ఐనా చేతన్ ఆగనేలేదు. చెంగున ఇంకా ముందుకు దుమికాడు. చిరుతలాంటి అల వొకటి మీదకొచ్చిపడి కుందేలు పిల్లను లాక్కొన్నట్లుగా వాడిని తనవైపు గుంజుకొన్నది.
“అరెరే లాగండి లాగండి!” అని అక్కడున్న ఓ పెద్దావిడ కేకవేయటంతో, దగ్గర్లో ఉన్న ఇద్దరు కుర్రాళ్లు వేగంగా అటుకదిలి చేతన్‌ను రెక్కలు పట్టుకుని బయటికి లాక్కొచ్చారు!
భయంతో స్థాణువై నిలుచున్న సుబ్బన్న తేరుకుని కొడుకును సమీపించి..
“అల్లరెదవా! బుద్ధుందా నీకు. ఆడింది చాల్లే… రా” అంటూ తిడుతూనే తుండుతో వాడి తలావొళ్లూ తుడిచాడు. ఆ తెప్పలో చిక్కుకున్నపుడు ప్రాణం కొద్దిసేవు ఉక్కిరిబిక్కిరైనా అదికూడా చాలా అబ్బురంగా అనిపించింది ఆ పిల్లవాడికి. దేనిపట్లయినా ఆరాధన తారాస్థాయికి చేరితే ప్రమాదమూ ప్రమోదమే కదా!
ఇంత జరిగినా చేతన్ మళ్లీ తండ్రిని బతిమాలి ఇంకొద్దిసేపు ఆ బీచ్‌లోనే గడిపేందుకు ఒప్పించాడు! చల్లటి ఇసుకపై వింతవింత బొమ్మలు గీస్తూ, వేల బిలాలనుండి తేలుతూ మునుగుతూ ఉన్న పీతల పిల్లలతో తనూ దోబూచులాడుతూ, గుప్పిళ్ల నిండుగా నత్త గుల్లల్ని నింపుకొంటూ మళ్లీ వాటిని అలలవైపు విసిరేస్తూ మహా ఉల్లాసంగా పడుతూ లేస్తూ.. రోజంతా ఆ సాగరతీరాన మువ్వలు కట్టిన బుజ్జాయి దూడలా ఆడిపాడి అలసిసొలసాడు. అలసిన ఆ కన్నుల్లో నిదుర మొగ్గలు పూయసాగాయి. సూరీడు తనూ ఓ చిన్నవాడై సాగరమాత నుదుటిన కుంకుమబొట్టంత అయ్యే సాయంసందెకల్లా సుబ్బన్న కొడుక్కి ఒళ్లంతా శుభ్రంగా తుడిచి పొడిబట్టలు వేసి బయలుదేరాడు. దారిమధ్యలో తండ్రి భుజాలపై సేదదీరుతూ నిద్రగమ్మి కన్నులు మూతబడుతుండగా.. అల్లంతదూరంలోని సముద్రాన్ని వీడలేక అటువైపే తిరిగి తిరిగి చూస్తూ తండ్రిని అడిగాడు.
“నాయనా… సముద్రంలో కమలాలు పూయవా?”
“పూయవయ్యా. చెరువుల్లోనే పూస్తాయి”
“ఇక్కడా తామరలుంటే…. మనకు ఎన్ని పూలో, ఎన్ని ఆకులో కదా!”
“చాల్లేరా నీ ఆశ! ఇక పడుకో”
“ఐనా… మన పేరంటాలమ్మ చెరువే గ్రేట్ నాయనా!”
ఆ మాటకు పెద్దగా నవ్వుతూ..
“ఏంటో తండ్రీ నీ వాలకం. నీలోనే పున్నముందీ… నీలోనే అమాసుంది!” అంటూ ఆ భీమిలి తీరానికి వీడ్కోలు పలికాడు సుబ్బన్న.
సుబ్బన్నకు సముద్రపుగాలి పడలేదు. సుస్తీ చేసి కొన్ని రోజులు చెరువు దగ్గరికి వెళ్లలేదు. ఆకులు కావాలని ఆర్డర్లు వస్తున్నాయి. అందుకే చేతన్ తనే ఒకరోజు సంచి తీసుకుని బయల్దేరాడు…
“నీకు చేతగాదు… వద్దు” అని తండ్రి ఎంత చెప్పినా వినలేదు. వాడి దోస్తు శంకర్ కూడా సాయంగా బయల్దేరాడు.
వేసవిలో కూడా ఎండిపోని జీవసరస్సు ‘పేరంటాలమ్మ కుంట’. ఫాల్గుణ మాసం చివరివరకూ తామరలు దొరుకుతూనే ఉంటాయి. చేతన్, శంకర్ ఇద్దరూ చెరువులోకి దిగి ఆకులు కోయటం మొదలుపెట్టారు. ఉత్సాహంగా అడిగాడు శంకర్.
“ఒరే చేతన్! సముద్రమెలా ఉందిరా? నచ్చిందా నీకు?”
“బాగా… చాలా బాగా నచ్చిందిరా. కానీ, అందులో ఒక్క కమలం పూవైనా లేదురా!”
“ఐతే మన చెరువే గ్రేటన్నమాట! సూపర్! ఈ పువ్వు చూడరా… ఎంత బాగుందోరా” అంటూ శంకర్ పెద్దగా విచ్చుకున్న ఒక కమలాన్ని చూపుతూ సుతారంగా తన చెక్కిళ్లకు అద్దుకున్నాడు.
ఇంతలో భీకరంగా ‘ఫెళ్ ఫెళ్’ అంటూ ఏవో నేలకూలుతున్న పెద్ద పెద్ద శబ్ధాలు వినవచ్చాయి. ఉలిక్కిపడిన పిల్లలిద్దరూ అటుగా చూసారు. చెరువు అవతలివైపు ఎర్రదుబ్బ వికారంగా పైకి లేస్తోంది. అటు రెక్కలు పైకి కదుపుతున్న రాబందుల్లా తమ హైడ్రాలిక్ లిఫ్ట్‌లను పైకి లేపుతూ పెద్ద పెద్ద ట్రక్కులు భారీగా ఎర్రమన్నును చెరువులోకి డంపు చేస్తున్నాయి. చేతన్ మనసు ఏదో కీడు శంకించింది.
“శంకర్! ఏంట్రా చెరువులో మట్టి పోస్తున్నారు?”
“ఓ! నీకు చెప్దామనుకుని మర్చిపోయారా. హైవే పనులు స్టార్టయ్యాయి!”
“ఐతే? చెరువేం అడ్డంరా?”
“హైవే ప్లాను మారిందంట. అటేపు పొలాలు పోకుండా ఇటు తీసారంట!”
ఆ మాట విన్న వెంటనే ఒంట్లో నెత్తురంతా పాదాల్లోకి తెచ్చుకున్నట్లుగా.. ఉరుకుతూ రొప్పుతూ వాకిట్లోకి వచ్చిపడి అమాంతం తండ్రి పడుకున్న మంచంపై వాలి గొంతు పగిలేలా అరిచాడు.
“నాయనా ఇదిన్నావా? మనూరి చెరువు పూడుస్తున్నారు”
“ఏంట్రా? చెరువు పూడుస్తున్నారా? ఎవర్రా ఆ ఎదవ నాయాళ్లు?” అంటూ, ఒంట్లో బాగోలేక పోయినా శక్తి కూడదీసుకుని ఒక కర్ర చేతబట్టుకుని.. శివాలూగుతూ చెరువువైపు పరుగులు తీసాడు సుబ్బన్న.
“అయ్యో రామ! ఇంక మేమెట్లా బతకాలి పేరంటాలమ్మ తల్లో” అంటూ రాధమ్మ గుండెలు బాదుకుంటోంది.
సుబ్బన్న చెరువు దగ్గరికి చేరేసరికే చాలామంది పోగయ్యారక్కడ. చేతిలో కర్రాడిస్తూ మొరం మట్టిని చెరువులోకి పోస్తున్న ట్రక్కులవైపు ఉరుకుతూ మొత్తుకోసాగాడు.
“ఓయ్… ఎవరయ్యా మీరంతా? ట్రక్కులాపండి… ఆపండి”
ఇద్దరు కానిస్టేబుళ్లు ముందుకెళ్లి సుబ్బన్నను రెక్కలు పట్టుకొని ఎస్సై దగ్గరికి గుంజుకొచ్చారు.
“ఏం బాబాయ్! ఏంటి సంగతి? లారీలకడ్డంగా పోతున్నావు. చస్తావా ఏం?”
“అయ్యా… ఊరు చెరువిది. ఎందుకింత అన్యాయంగా పూడ్చుతున్నారు?”
“తెలవదా పెద్దమనిషీ? ఎక్కడ నిద్రపోతున్నావ్? రోడ్ ప్లాన్ మారింది. సర్వీస్ రోడ్డు ఇక్కడే దిగుతుంది. ఆర్డీవోగారు పేపర్లలో నోటిఫికేషన్ కూడా ఇచ్చారుగా. ఆ మధ్య చాటింపు గూడా వేసారు…”
“అయ్యా… నేనీ చెరువు మీదనే బతుకుతున్నా. పోయినసారి నవరాత్రులకు మీ క్వార్టర్స్‌కు కూడా వచ్చాను. మేడంగారు కబురు పంపితే వచ్చి పూలు-పత్రీ తెచ్చాను. మీరూ నన్ను చూసారు ఎస్సై గారూ! గుర్తుపట్టలేదా సార్!” అంటూ సుబ్బన్న ఎస్సైతోపాటు అక్కడున్న రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బందిని చేతులు, గడ్డాలు పట్టుకుని.. చెరువు పూడ్చే పనులాపమని దీనంగా కన్నీరుపెడుతూ వేడుకుంటున్నాడు.
తన తండ్రి అలా జాలిగా ప్రవర్తించటం చేతన్‌కు నచ్చలేదు. తను చూసొచ్చిన సముద్రపు పోటుపాట్లులా ఉక్రోషం, బాధ అతని గుండెల్లో ఎగసిపడుతున్నాయి. ఇంతలో ఊరిజనం నలుగురైదుగురు సుబ్బన్న దగ్గరికొచ్చారు.
“సుబ్బన్నా… నువ్వసలు ఊళ్లోకే సరిగా రావు. చెరువు, ఇల్లు, గుళ్లు! అంతే! అసలు ఊళ్లో ఏం జరుగుతోందో పట్టించుకోవా?” వెక్కిరింపుగా కసిరాడు పెద్దమనిషి రాములు.
“రా… ఇట్రారా సుబ్బన్న! అట్లా కబోదిలా ఏడవకు. చెర్లో ఆకులు ఏరుకునే నీకే అంత బాధుంటే.. చెరువు కింద పొలాలోళ్లం మేమెంత ఏడవాలి చెప్పు? రేపు కోర్టుకెళ్తున్నాం. నువ్యూ కలువ్! ఎంతో కొంతివ్వు…. రా ఇక ఏడ్చింది చాల్లే” అంటూ కోప్పడ్డాడు ఇంకో మోతుబరి కిషన్ రావు.
“కోర్టులూ గీర్టులూ నావల్ల కాదన్నా. ఆకులు, పూలమ్ముకుని ఎల్లదీసుకునేవాళ్లం. కూలీనాలీ చేసుకుంటాం. కూడు దొరక్కపోతే ఉరేసుకు చస్తాం” అని తుండుగుడ్డతో కన్నీళ్లు తుడుచుకుంటూ పోలీసులు, అక్కడున్న అధికారులవైపు తిరిగి..
“అయ్యా సార్లూ! మీరంతా కలిసి ఈ చెర్లో కాదయ్యా మన్నుపోసేది… మా కూట్లో… మా నోట్లో” అని నిరసనగా కీచుగొంతుకతో ఏడుస్తూ.. కొడుకు చేయి పట్టుకుని నీరసంగా తూలే అడుగులతో ఊరివైపు మరలాడు సుబ్బన్న.
ఎన్నో యేళ్లుగా వాళ్లను పోషిస్తూ ఉన్న ఆ పేరంటాలమ్మ చెరువు.. ఇంకొన్ని గంటల్లోనే మాయమై పోతుందనే ఆలోచనను తట్టుకోలేని ఆ తండ్రీకొడుకులు.. మధ్యమధ్యలో వెనుకకు తిరుగుతూ చెరువునే చూసుకుంటున్నారు.
అల్లంత దూరంలో ఉన్న ఎర్రకాళ్ల కొంగ వాళ్లకు దగ్గరగా ఎగిరొచ్చి గట్టుపై వాలింది. దాని ముక్కున ఈసారి చేపపిల్ల లేదు! మట్టిపెళ్లల కింద సమాధవుతున్న కమలాలు మాత్రం..
‘అయ్యా… కడసారి మమ్మల్ని తాకిపోరా మీరు?’ అని ఊపిరి వదులుతున్న చంటిపాపల్లా అవి చేస్తున్న ఆలాపనొకటి లీలగా వినిపిస్తోంది ఆ తండ్రీకొడుకులకు.
“నాయనా… మనమీ ఊర్లో ఉండొద్దు”
“ఎక్కడికని పోతాం బిడ్డా? ఆ గోదారి మీ అమ్మ ఊరిని… ఈ రాదారి మన చెరువమ్మనీ మింగేసాయి. అంతా సర్కారోళ్ల దయ – కాంట్రాక్టర్ల మాయ! గుళ్లో పలారాలు పంచే ఆకులు పుట్టే కుంటల్ని కూడా దైవాలు కాపాడుకోలేని కాలం! గరీబోళ్లం… మనవల్ల ఏమవుద్దిరా?”
“సరేమరి… ఈ ఊర్లోనే ఉందాంలే గానీ, మన కోటిమామేగా మొన్న సర్పంచయింది. పా… పద నాయనా ముందాయన్ని పిల్చుకొద్దాం!” అంటూ తండ్రి చేతిని గట్టిగా లాగాడు.
“ఇదంతా పెద్ద యవ్వారంరా. నీ చిన్ని బుర్రకెక్కదు. మనలాంటోళ్ల బతుకుల్ని కూల్చే ఈ డ్యాముల్నీ, హైవేల్నీ ఆపాలంటే సర్పంచి ఏం సరిపోతాడయ్యా!”
“మరెవరు ఆపుతారు నాయనా?”
“ముఖ్యమంత్రి అంతటోళ్లే కావాలి”
“ఐతే నేనవుతానయ్యా!”
“ఏంట్రా.. చేతన్ అయ్యేది?”
“ముఖ్యమంత్రి! నేను ముఖ్యమంత్రిని అవుతా నాన్నా!”
“అదెప్పటికి జరిగేనురా కన్నా?”
“ఎప్పటికైనా సరే నాన్నా…”
“అంత పెద్ద ఆశెలా పుట్టిందయ్యా నీలో?”
“సముద్రాన్ని చూసినప్పటి నుండి నాన్నా!”
వేణు మరీదు
వేణు మరీదు
85550 53547