ఆధునిక డిజిటల్ యుగంలో సోషల్ మీడియా టీనేజర్ల జీవితాల్లో ఒక అంతర్భాగంగా మారింది. ఈ డిజిటల్ ప్రపంచంలో సైలెంట్‌గా పిల్లలను ముంచెత్తుతున్న అతిపెద్ద మానసిక ముప్పు ‘సోషల్ మీడియా కంపారిజన్ ట్రాప్’. టీనేజర్లు తమను తాము ఇతరులతో పోల్చుకోవడం సహజమే అయినప్పటికీ, సోషల్ మీడియా వల్ల ఈ పోలికల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
సోషల్ మీడియా కంపారిజన్ ట్రాప్ వల్ల కలిగే మానసిక ప్రభావంపై పలు అధ్యయనాలు విస్తుపోయే వివరాలను వెల్లడించాయి. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ 15 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉన్న భారతీయ యువతపై చేసిన అధ్యయనంలో దాదాపు 60 శాతం మంది సోషల్ మీడియాలో పోలికలు, లైక్స్ ఆందోళన, ఫోమో వల్ల యాంగ్జయిటీ లక్షణాలను అనుభవిస్తున్నారని తేలింది. రోజుకు నాలుగు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియా స్క్రోలింగ్ చేసే టీనేజర్లలో డిప్రెషన్ లక్షణాలు రెండు గంటల కంటే తక్కువ వాడే వారితో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది.
టీనేజ్ అమ్మాయిలపై జరిపిన అధ్యయనాల ప్రకారం ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో కనిపించే వెస్ట్రన్ బ్యూటీ ప్రమాణాలు, పర్ఫెక్ట్ ఫిల్టర్ల వల్ల బాడీ డిస్సాటిస్ఫాక్షన్, ఈటింగ్ డిజార్డర్లు పెరుగుతున్నాయి. సౌందర్యం, శరీర ఛాయకు సంబంధించి ఇప్పటికే ఉన్న సామాజిక ఒత్తిళ్లకు డిజిటల్ పోలికలు తోడై స్వీయ గౌరవం తీవ్రంగా క్షీణిస్తున్నది. 2023లో నిర్వహించిన ఒక ల్యాండ్‌మార్క్ అధ్యయనం ప్రకారం ‘అప్‌వర్డ్ సోషల్ కంపారిజన్’ (తమ కంటే ఇతరులు అందంగా, ధనవంతులుగా ఉన్నారని భావించడం) వల్ల యువత మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. యువతలో 72 శాతం మంది ఇతరుల వెకేషన్ ఫోటోలు, లైఫ్‌స్టయిల్ అప్డేట్స్ చూసి అసూయ లేదా విచారానికి గురవుతున్నారు. 81 శాతం మంది ఇతరుల కంటే మెరుగ్గా కనిపించడానికి తమ ఫొటోలను ఫిల్టర్ చేశాకే పోస్ట్ చేస్తున్నారు.
ముప్పు ఇలా..
సోషల్ మీడియాలో ఎవరైనా సరే తమ జీవితంలోని అత్యుత్తమ క్షణాలను, అందమైన ఫొటోలను మాత్రమే పోస్ట్ చేస్తారు. టీనేజ్ పిల్లలు వీటిని నిజమని నమ్మి, తమ నిత్య జీవితంతో పోల్చుకోవడం ప్రారంభిస్తారు. ఇది వారి మానసిక తీరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
శరీరాకృతిపై అసంతృప్తి
ఆకర్షణీయమైన ఫిల్టర్లు, ఎడిట్ చేసిన బాడీ పిక్చర్స్ చూసి టీనేజర్లు తమ శరీరం, రంగు, బరువు పట్ల తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు. ఉదాహరణకు 15 ఏండ్ల రమ్య (పేరు మార్చాం) ఇన్‌స్టాగ్రామ్‌లో మాడల్స్, ఇన్ఫ్లూయెన్సర్ల సన్నని నడుము, కాంతిమంతమైన చర్మం చూసి, ‘నేను అందంగా లేను‘ అని భావించడం మొదలుపెట్టింది. దీనివల్ల ఆమె తిండి తగ్గించేసి తీవ్రమైన ఈటింగ్ డిజార్డర్‌కు గురైంది.
తక్కువ ఆత్మవిశ్వాసం
లైక్స్, కామెంట్లు, ఫాలోవర్ల సంఖ్యను తమ ఆత్మగౌరవానికి కొలమానంగా మార్చుకుంటున్నారు. ఉదాహరణకు 16 ఏండ్ల కార్తిక్ తను పెట్టిన ఫొటోకి ఫ్రెండ్స్ కంటే తక్కువ లైక్స్ వచ్చాయని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తోటి పిల్లలతో పోల్చుకుని తనను తాను అసమర్థుడిగా భావిస్తూ, స్కూల్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం మానేశాడు.
ఫోమో (ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్)
ఇతరులు పార్టీలు చేసుకోవడం, ట్రిప్స్‌కి వెళ్లడం చూసినప్పుడు, తమను అందరూ పక్కన పెట్టేశారనే ఆందోళన, ఒంటరితనం భావన పెరుగుతుంది. ఉదాహరణకు స్నేహితులంతా కలిసి వెళ్లిన పిక్నిక్ ఫొటోలను సోషల్ మీడియాలో చూసిన ఒక టీనేజర్, తనను పిలవలేదని రాత్రంతా నిద్రపోకుండా తీవ్రమైన ఆందోళనకు గురయ్యాడు.
డిప్రెషన్, మానసిక తీవ్రత
నిరంతరం ఇతరుల జీవితంతో తమను పోల్చుకోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగి, నిరాశ, సైబర్ బుల్లీయింగ్‌కు గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.
లక్షణాలు ఇవీ..
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
డిజిటల్ అక్షరాస్యత పెంచడం: సోషల్ మీడియాలో కనిపించేవి నిజాలు కావు, అవన్నీ స్క్రిప్టెడ్ లేదా ఫిల్టర్ చేసిన ఫొటోలని పిల్లలకు వివరంగా బోధించాలి.
స్వీయ అంగీకారం: ప్రతీ వ్యక్తి ప్రత్యేకమైన వారని, బాహ్య అందం కంటే వ్యక్తిత్వం, నైపుణ్యాలు ముఖ్యమని ఇంట్లో వాతావరణం కల్పించాలి.
స్క్రీన్-ఫ్రీ సమయం: రాత్రి నిద్రపోయే ముందు, భోజన సమయంలో డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండేలా హద్దులు విధించాలి.
ఓపెన్ కమ్యూనికేషన్: పిల్లలు తమ భావాలను, అభద్రతా భావాలను ఎలాంటి భయం లేకుండా పంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలి.
సోషల్ మీడియా అనేది ఒక సాధనం మాత్రమే. దానిని స్వయం సమృద్ధికి వాడాలే తప్ప, స్వీయ విచ్ఛిన్నానికి ఉపయోగించకూడదని టీనేజ్ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడం పెద్దల బాధ్యత. సోషల్ మీడియా అల్గారిథమ్ ఎలా మనసును మాయ చేస్తుందో వారికి వివరిస్తే ఈ ట్రాప్ నుంచి బయట పడే అవకాశం ఉంటుంది. అప్పటికి వారు అదే ట్రాప్‌లో ఉంటే సైకాలజిస్ట్‌ని సంప్రదించడం మంచిది.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్,
హైదరాబాద్, 99854 28261