దుండిగల్,సెప్టెంబర్26: బీఆర్ఎస్ పోరాటం కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ నిషేధిత భూములపై వెనకడుగు వేసిందని ఎమ్మెల్యే,బీఆర్ఎస్ఎల్పీ విప్,కేపీ వివేకానంద్ అన్నారు. రాష్ట్రంలోని లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం నిషేధిత జాబితా 22ఏలో చేర్చి ప్రజల జీవితాలను పణంగా పెట్టిన నేపథ్యంలో బీఆర్ఎస్ కొన్ని రోజులుగా ఆందోళన చేపట్టిందన్నారు. కుత్బుల్లాపూర్ మండలపరిధి
గాజులరామారంలోని మహదేవపురం,మల్లారెడ్డినగర్,చెన్నకేశవనగర్ వాసుల ఇండ్ల స్థలాలను 22ఏ నుంచి తొలగించిన నేపథ్యంలో శనివారం మహదేవపురం చౌరస్తాలో ఎమ్మెల్యే వివేకానంద్‌కు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పదేండ్ల పాటు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా మౌలికవసతులను కల్పిస్తూ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిన ఘనత బీఆర్ఎస్ అధినేత, తొలిముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కానీ మూడేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు మరిచిందని ప్రజాకంఠక పాలన కొనసాగిస్తుందన ఎద్దేవా చేశారు.
22ఏ పేరుతో లక్షల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధింపులకు గురిచేసిందన్నారు. కార్యక్రమంలో గాజులరామారం డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు విజయరాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరిబాల్రాజు,తెలంగాణసాయి,కమలాకర్,అంజన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి వీరనారి చాకలి ఐలమ్మ ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే,బీఆర్ఎస్ఎల్పీ విప్,కేపీ.వివేకానంద్ అన్నారు. శనివారం ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రజకసంఘం ఆధ్వర్యంలో గాజులరామారం చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ రజక సంఘం అధ్యక్షుడు చింతస్వామి, ప్రధానకార్యదర్శి సింగారం మల్లేశ్, ఉపాధ్యక్షుడు మురళీ, సలహాదారులు రాకేశ్, సభ్యులు సత్యనారాయణ, యాదగిరి, రాజు, చందు, వేణు, నర్సింగ్, విఠల్, నరేశ్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.