తిరువనంతపురం: ఒక బాలిక తన ప్రియుడితో తాతను హత్య చేయించింది. క్లాత్‌తో ముక్కు, నోరు మూసి ఊపిరాడకుండా చేసి ఆయనను చంపడాన్ని వీడియో కాల్లో చూసింది. ఆ తర్వాత తనకేమీ తెలియనట్లు నటించేందుకు ఆమె ప్రయత్నించింది. (Girl Plots Grandfather’s Murder) వృద్ధుడి హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు మైనర్లైన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేరళలోని అలప్పుజలో ఈ సంఘటన జరిగింది. 67 ఏళ్ల తాత హత్యకు 13 ఏళ్ల మనుమరాలు కుట్రపన్నింది. ఆయన చిన్నకుమార్తె ప్రసవం కోసం అలప్పుజలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. ఆమెకు తోడుగా ఉండేందుకు ఆయన భార్య అక్కడికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ వృద్ధుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు.
కాగా, ఆగస్ట్ 15న రాత్రివేళ బాలిక ప్రియుడైన 17 ఏళ్ల యువకుడితో పాటు మరో ముగ్గురు బాలురు ఆ ఇంటికి చేరుకున్నారు. వీడియో కాల్లో ఆమె సూచనల మేరకు బాత్రూమ్ వెంటిలేటర్ ద్వారా ఆ వృద్ధుడి గదిలోకి ప్రవేశించారు. ఆ తర్వాత అతడి కాళ్లు, చేతులు కట్టేశారు. నోటిలో గుడ్డ కుక్కారు. ఆ వృద్ధుడి తలను గోడకేసి బాదారు. ముక్కు, నోరును గుడ్డతో మూసి ఊపిరి ఆడకుండా చేసి చంపారు. తాత హత్యను ఆ మనవరాలు వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూసింది. వృద్ధుడ్ని చంపిన ఆ యువకులు 4.5 కాసుల బంగారంతో అక్కడి నుంచి పారిపోయారు.
ఆ మరునాడు ఇంట్లో ఏమీ జరుగనట్లు ఆ బాలిక నటించింది. చిన్నపిల్లలతో కలిసి రెండుసార్లు సమీపంలోని షాప్ వద్దకు వెళ్లి చిప్స్ ప్యాకెట్లు కొన్నది. తన తాత తలుపు తీయడం లేదని స్థానికులకు ఆమె చెప్పింది. మద్యం సేవించి నిద్రపోతుండవచ్చని షాపు వ్యక్తితో అన్నది.
మరోవైపు ఆ వృద్ధుడి గది తలుపును బలవంతంగా తెరిచి చూసిన బంధువులు అతడు హత్యకు గురైనట్లు తెలుసుకుని షాక్ అయ్యారు. అయితే తాత మరణించినప్పటికీ స్కూల్‌కు వెళ్లేందుకు ఆ బాలిక యూనిఫాం ధరించి సిద్ధమైంది. పరీక్షకు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉన్నదని ఒక షాపు వ్యక్తికి చెప్పింది.
వృద్ధుడి హత్య సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో బంగారం మాయం కావడంతో తొలుత దొంగల పనిగా అనుమానించారు. సీసీటీవీ ఫుటేజ్‌తో పాటు ఇతర సాంకేక ఆధారాలతో దర్యాప్తు చేసిన తర్వాత మనుమరాలే తన ప్రియుడితో కలిసి తాతను హత్య చేయించినట్లు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఆ బాలికతో పాటు ఆమె ప్రియుడైన 17 ఏళ్ల యువకుడు, నేరంలో పాల్గొన్న మరో ముగ్గురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
కాగా, తాత తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయనపై పగ పెంచుకున్నట్లు ఆ బాలిక పోలీసులకు చెప్పింది. అయితే ఈ నేరానికి డబ్బు ఒక కారణం కావచ్చని పోలీస్ అధికారి తెలిపారు. ఆ బాలిక మొబైల్ ఫోన్, ఆమె ప్రియుడు బైక్ కొనాలనే ఉద్దేశంతో ఈ కుట్రకు పాల్పడినట్లు చెప్పారు. ఆ యువకులు మాదకద్రవ్యాలు వాడి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మైనర్లైన నిందితులను జువెనైల్ హోమ్‌కు తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. పెద్దల తరహాలో వారి విచారణ కోసం ‘జువెనైల్ జస్టిస్ బోర్డు’ను కోరతామని అన్నారు.
మరోవైపు ఈ విషాద సమయంలో ఆ వృద్ధుడి చిన్నకుమార్తె ఆడబిడ్డను ప్రసవించింది. వృద్ధుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం అదే ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఈ నేపథ్యంలో చిన్నకుమార్తె ప్రసవం కోసం అక్కడే ఉన్న ఆయన భార్య మార్చురీలో ఉన్న భర్త మృతదేహాన్ని కడసారి చూసుకునే పరిస్థితి ఎదురుకావడం ఆ కుటుంబాన్ని మరింత కుంగదీసింది.