మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నారనడానికి సాక్ష్యాలు లేవని, ఆయన బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పు మరోసారి అపహాస్యం పాలైంది.
స్పీకర్ నిర్ణయంతో ప్రస్తుతానికి అనర్హత వేటు నుంచి తప్పించుకున్న బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి.. మరింత బాహాటంగా కాంగ్రెస్‌తో చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. పార్టీ గుర్తులపై జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన ఫొటోలను చూపిస్తూ… ‘స్పీకర్ సార్.. ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి?’ అని నియోజకవర్గ ప్రజులు చర్చించుకుంటున్నారు.
బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బుధవారం గద్వాల మున్సిపాలిటీ పరిధిలో నాలుగు, ఐదో వార్డు (జమ్మిచేడు)లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. హస్తం గుర్తుకు ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. మందీ మార్బలాన్ని వెంటేసుకొని కాంగ్రెస్ కండువాలు కప్పుకొన్న కార్యకర్తలు, నాయకులతో కలిసి బాహాటంగా ప్రచారం చేపట్టారు. దీంతో బండ్ల బీఆర్ఎస్లోనే ఉన్నారంటూ స్పీకర్ ఇచ్చిన తీర్పు మున్సిపల్ ఎన్నికల సాక్షిగా మరోసారి అపహాస్యం పాలైంది.