న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని చారిత్రక విద్రోహంగా వివిధ రైతు సంఘాల సమాఖ్య సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) అభివర్ణించింది. అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ షరతులకు ప్రధాని నరేంద్ర మోదీ సిగ్గులేకుండా మోకరిల్లారని ఎస్కేఎం ఆరోపించింది. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని గుర్తు చేసింది. రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు భారీ మూల్యాన్ని చెల్లించేందుకు సైతం తాను వ్యక్తిగతంగా సిద్ధంగా ఉన్నానంటూ మోదీ చెప్పిన మాటలను ఎస్కేఎం మంగళవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో గుర్తు చేసింది.
ఈ ఒప్పందంతో భారీ సబ్సిడీలు పొందిన వ్యవసాయ ఉత్పత్తులు భారతీయ మార్కెట్లపై వెల్లువెత్తుతాయని, ఇవి భారతీయ వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తాయని ఎస్కేఎం ఆందోళన వ్యక్తం చేసింది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అమెరికా అంగీకరించినట్లు ట్రంప్ ప్రకటించిన మరుసటి రోజున ఎస్కేఎం నుంచి ఈ ప్రకటన వెలువడింది.ఈ ఒప్పందం కింద గతంలో భారతీయ దిగుమతులపై విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలను అమెరికా 18 శాతానికి తగ్గించింది.
ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన రైతు సంఘాల సమాఖ్య మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ముఖ్యంగా రైతులకు ద్రోహం చేసిందని, అమెరికా సామ్రాజ్యవాదానికి లొంగిపోయి అమెరికా వస్తువులపై సున్నా శాతం దిగుమతి సుంకానికి అనుమతించిందని ఎస్కేఎం ఆరోపించింది. దేశ జనాభాలో 48% మంది కార్మికులు, 65%మంది ప్రజలు వ్యవసాయంపైన, దాని అనుబంధ రంగాలపైన ఆధారపడి జీవిస్తున్నారని తెలిపింది. ఈ చారిత్రాత్మక విద్రోహానికి పాల్పడిన మోదీని రైతులు ఎన్నటికీ క్షమించరు అని ఎస్కేఎం స్పష్టం చేసింది. ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చిన ఎస్కేఎం ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెను ప్రకటించింది.