శనివారం 30 మే 2020
Telangana - May 21, 2020 , 19:11:25

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం : మంత్రి అల్లోల

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం : మంత్రి అల్లోల

హైద‌రాబాద్ : పర్యావరణాన్ని, జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం (మే 22) సంద‌ర్బంగా ఆయ‌న మాట్లాడుతూ..ఈ  ప్ర‌కృతిలో మ‌న ప‌రిష్కారాలు అనే థీమ్ తో ఈ సంవ‌త్స‌రం అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని జ‌రుపుకుంటు‌న్నామ‌న్నారు. జీవ వైవిధ్యం ప్రకృతి కేంద్ర సూత్రమని అద్భుతమైన వివిధరకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవుల సమ్మేళనంతో ఏర్పడిన పర్యవరణ వ్యవస్థలని, పరస్పరం సంబంధం కలిగి ఉంటుందని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. ప్రకృతిలోని అన్ని సమతుల్యతలు పాటించాలని, లేకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ప్రకృతిని మనం సంరక్షించితే అది మనల్ని కాపాడుతుందన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఏర్పాటు చేసి.. ‘జీవవైవిధ్య నియమావళి–2015’ను రూపొందించిందని చెప్పారు. జీవ వనరుల సేకరణ, వినియోగానికి సంబంధించిన కార్యకలాపాలపై నియంత్రణ, స్థానిక సంస్థల పరిధిలో 13,415 జీవవైవిధ్య యాజమాన్య కమిటీ ( B.M.C)ల ఏర్పాటు చేసి, జీవవైవిధ్య వారసత్వ స్థలాల గుర్తింపు, నిర్వహణ విధులను జీవవైవిధ్య మండలి చేపడుతోందన్నారు. యూత్ బ‌యో డైవ‌ర్సిటీ పార్ల‌మెంట్, చిల్డ్ర‌న్ బ‌యో డైవ‌ర్సిటీ వంటి కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌జ‌ల‌కు, విద్యార్థుల‌కు అవ‌గాహాన  క‌ల్పిస్తున్నామ‌న్నారు. ప్రత్యేక లక్షణాలను సొంతం చేసుకొని తెలంగాణకు తలమానికమైన‌ మన్ననూరు ఎడ్లకు జాతీయస్థాయిలో గుర్తింపు తేవడానికి  రాష్ట్ర జీవవైవిధ్య మండలి చేసిన కృషి ఫ‌లించింద‌న్నారు. logo