హైదరాబాద్ : రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దొంగ లెక్కలతో రుణమాఫీ చేశామని ప్రభుత్వం అంటోంది. రుణమాఫీని దేశం మొత్తం చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy )విమర్శించారు. ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతుభరోసా ఇవ్వమని రైతులు మొత్తుకుంటున్నారు. రైతులు పండించిన పత్తిని ప్రభుత్వం కొనడం లేదు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ధాన్యం కల్లాల్లో ఆరబోసుకుంటున్నా రని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మిల్లర్లతో చర్చలు చేయలేదు.వరి ధాన్యం, పత్తి కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు సమీక్ష చేయలేదని పేర్కొన్నారు. పత్తి రైతులకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ద్రోహం చేశాయని మండిపడ్డారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఎంజాయ్ చేస్తున్నారు . పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తూ ప్రజలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫోర్త్ సిటీ, ఫిఫ్త్ సిటీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అడ్డగోలుగా విద్యుత్ కోతలు ఉన్నాయి. 2014 కు ముందు ఉన్న పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయన్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించే మొగోడు బీజేపీలో(BJP) లేడని స్పష్టం చేశారు. రైతు రుణమాఫీ అందరికీ కాలేదని, వ్యవసాయ శాఖామంత్రి అంటున్నారు. రెండు లక్షల మందికి రుణమాఫీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి దబాయిస్తున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి ఆపలేరని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి తప్పులను సోషల్ మీడియా ఎత్తిచూపుతోంది. రేవంత్ రెడ్డికి ముసళ్ల పండుగ ముందుందని తెలిపారు.