సిద్దిపేట : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఫైర్ అయ్యారు. ఆదివారం సిద్దిపేట విపంచి కళానిలయంలో ఉపాధ్యాయుడు, టీపీటీఎఫ్ నాయకులు పొన్నమల్ల రాములుపదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అన్ని ఉద్యోగాలకు విరమణ ఉంటుంది కానీ ఉపాధ్యాయ వృత్తికి విరమణ ఉండదన్నారు. రాములు ఉద్యోగానికి మాత్రమే పదవీ విరమణ పొందారు. సామాజిక బాధ్యతకు కాదన్నారు.
తెలంగాణ ఉద్యమంలో మద్యపాన నిషేధ ఉద్యమంలో సిద్దిపేట దుబ్బాక ప్రాంతాల్లో రైతు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి కుటుంబాలను ఆదుకునే విషయంలో మాతోపాటు కలిసి పనిచేశారన్నారు. పదవీ విరమణ పొందిన రాములుని రిటైర్మెంట్ బెనిఫిట్స్( Retirement benefits) వచ్చాయా? అనే అడుగుతే ఇంక లేదు అని చెప్పారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయిన చివరి రోజు లేదా వారం రోజుల్లో వారికి రావాల్సిన రిటైర్మెంట్ డబ్బులు పూర్తి బెనిఫిట్స్‌ను ప్రభుత్వం అందించాలి.
కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ డబ్బులు మూడు సంవత్సరాల తర్వాతే అందుతాయని చెప్పడం దురదృష్టకరమన్నారు. బహుశా దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన మూడు సంవత్సరాలకు రిటైర్మెంట్ డబ్బులు ఇచ్చేది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఎద్దేవా చేశారు.
ఈ డిసెంబర్ వస్తే ఉద్యోగులకు 6 డీఏలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ,
ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పీఆర్సీని ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పటివరకు దాని ఊసే లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 7,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయితే.. ఒక్కరికి కూడా రిటైర్మెంట్ డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు. 20, 30 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగం చేసి దాచుకున్న డబ్బును ప్రభుత్వం ఇవ్వకపోవడం అన్యాయమని ఫైర్ అయ్యారు.