శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 18, 2020 , 01:58:47

మళ్లీ.. వాన

మళ్లీ.. వాన

  • ఘట్‌కేసర్‌లో 19.7 సెం.మీ. వర్షపాతం
  • హైదరాబాద్‌లో కుండపోత
  • రహదారులపై భారీగా నీరు
  • లోతట్టు కాలనీలు జలమయం
  • మరోసారి తెరుచుకున్న
  • హిమాయత్‌సాగర్‌ గేట్లు
  • జాతీయ రహదారులపై వరద 
  • విద్యుత్‌ సమస్యలుంటే
  • ఫిర్యాదులకు ‘ఊర్జా’ యాప్‌ 

హైదరాబాద్‌/ హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వాన మళ్లీ వణికిస్తున్నది. కుండపోత వర్షాల నుంచి తేరుకోకముందే మరోసారి దంచికొడుతున్నది. రెండ్రోజుల విరామంతో ఊపిరిపీల్చుకునేలోపే మళ్లీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉరుములు, మెరుపులతోకూడిన భారీ వర్షం హైదరాబాద్‌ను ముంచెత్తుతున్నది. క్యుములోనింబస్‌ మేఘాల కారణంగా శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఏకధాటిగా కురిసిన భారీవర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. లోతట్టు ప్రాంతాల్లోకి మళ్లీ నీళ్లు చేరాయి. నాలాలు పొంగిపొర్లాయి. రహదారులు చెరువులను తలపించాయి. జాతీయరహదారులపై భారీగా వరద ప్రవహిస్తున్నది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 12గంటల వరకు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం సింగపూర్‌ టౌన్‌షిప్‌లో మళ్లీ రికార్డుస్థాయిలో అత్యధికంగా 19.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ మండలం రాక్‌టౌన్‌లో 17.1సెం.మీ., భవానీ నగర్‌లో 17.03 సెం.మీ. చొప్పున వర్షం కురిసిందని టీఎస్‌డీపీఎస్‌ వెల్లడించింది. క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో నగరంలో భారీవర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నెలాఖరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని చెప్పారు. 


లోతట్టు ప్రాంతాల్లోకి నీరు

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని నదీంకాలనీ, బాలాపూర్‌, మలక్‌పేట, చార్మినార్‌, మూసారంబాగ్‌, ఉప్పల్‌, పీర్జాదిగూడ, ఎల్బీనగర్‌, నాగోల్‌ తదితర ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. షేక్‌పేట, అంబేద్కర్‌నగర్‌ నాలా ప్రాంతాలు, బేగంపేట, చైతన్యపురిలోని కమలానగర్‌, బాటసింగారం, వనస్థలిపురం, హయత్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, పెద్దఅంబర్‌పేట్‌, గుడిమల్కాపూర్‌, లంగర్‌హౌజ్‌, హబ్సిగూడ, రామంతాపూర్‌, సికింద్రాబాద్‌, తదితర ప్రాంతాల్లో వర ద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వర్షం నీరు చేరింది. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వచ్చే రహదారిపై నడుము లోతు వరద ప్రవహిస్తున్నది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో భారీ వర్షానికి కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉప్పల్‌, మెహిదీపట్నం వైపునకు వెళ్లే మార్గంలో, టోలిచౌకి ప్రాంతంలో ట్రాఫిక్‌ కష్టాలతో వాహనదారులు చుక్కలు చూశారు. గోల్నాక, మూసారంబాగ్‌ వంతెనపై భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 

జాతీయరహదారిపై భారీ వరద

జాతీయ రహదారులపై భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. బెంగళూరు జాతీయరహదారిపై భారీగా వరద చేరడంతో ముందు జాగ్రత్తగా గగన్‌పహాడ్‌వైపు రాకపోకలను నిలిపివేశారు. సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేట చుట్టల బస్తీలో వర్షపునీరు ఇండ్లలోకి చేరింది. పాతబస్తీ అల్‌ జుబేర్‌కాలనీ మళ్లీ జలమయమైంది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారం-మజీద్‌పూర్‌ మధ్యలో వరద ప్రవాహానికి ఓ కారు కొట్టుకుపోయింది. అందులో ఇద్దరు ఉన్నట్టు తెలిసింది. ఉప్పల్‌ వరంగల్‌ జాతీయరహదారిపై భారీగా వరద ప్రవాహంతో రాకపోకలకు ఇక్కట్లు తలెత్తాయి. సికింద్రాబాద్‌లో విద్యుదాఘాతం కారణంగా ఇంట్లో మంటలు చెలరేగాయి. వర్షాల కారణంగా మూసారంబాగ్‌ వంతెనపైనుంచి రాకపోకలను నిషేధించారు. ఎల్బీనగర్‌-విజయవాడ రహదారిపై వరద ప్రవాహంతో వాహనాలు నిలిచిపోయాయి. గోల్నాక కొత్త వంతెనపై భారీగా వరద నీరు నిలిచింది. హిమాయత్‌సాగర్‌ జలాశయంలోకి భారీగా వరదనీరు చేరడంతో మరోసారి రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. విద్యుత్‌ సరఫరాపై సీఎండీ రఘుమారెడ్డి సమీక్షించారు. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. విద్యుత్‌ సమస్యలపై ‘ఊర్జా’ యాప్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. 

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది సహాయ చర్యలు ముమ్మరం చేశా రు. అత్యవసరం అయితే తప్ప ఎవ్వరూ బయట కు రావొద్దని పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారు లు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు మరిం త అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారులు శనివారం రాత్రినుంచి అత్యవసర విధు ల్లో నిమగ్నమయ్యారు. ఏ సమస్య వచ్చినా 100 కు ఫోన్‌ చేయాలని నగరవాసులకు సూచించారు.

అప్రమత్తంగా ఉండండి: డీజీపీ మహేందర్‌రెడ్డి 

హైదరాబాద్‌ నగరంతో సహా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పోలీస్‌ సిబ్బందిని డీజీపీ ఎం మహేందర్‌రెడ్డి అప్రమత్తం చేశారు. భారీ వర్షాలతో ప్రాణనష్టం జరుగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, క్షేత్రస్థాయిలో జీహెచ్‌ఎంసీ, జిల్లాల్లో కలెక్టర్లు, ఇత ర ప్రభుత్వశాఖలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని పోలీస్‌ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం నుంచి ఐదు రోజులపాటు పోలీస్‌సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని ఆయన ఆదేశించారు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షం నేపథ్యంలో సహాయ చర్యలపై హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్లతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. తగిన సూచనలు ఇచ్చారు.  

రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం 

రాష్ర్టానికి మళ్లీ వానల బుగులు పట్టుకున్నది. మధ్య బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఇది మంగళవారం నాటికి మరింత బలపడొచ్చు. మరోవైపు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ రెండింటి ప్రభావంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నాలుగురోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. ఆదివారం ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, సోమవారం భారీ వర్షాలు పడుతాయని చెప్పారు. ప్రధానంగా మంగళ, బుధవారాల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు కురువొచ్చని వెల్లడించారు. వర్షాలు మళ్లీ పుంజుకోనున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు.

అరేబియాలో వాయుగుండం

అరేబియా సముద్రంపై ఏర్పడ్డ అల్పపీడనం తీవ్రంగా మారి వాయుగుండం ఏర్పడిందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) వెల్లడించింది. అయితే వాయుగుండం భారత తీరం నుంచి దూరంగా కదులుతున్నదని, ఇది 48 గంటల్లో బలహీనపడుతుందని తెలిపింది. దీని ప్రభావంతో గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్‌ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రాగల 24గంటల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. వాయుగుండం ప్రభావం పశ్చిమ తీరంపై స్వల్పంగానే ఉంటుందని తెలిపింది.