Harish Rao | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని హరీశ్‌రావు పరిశీలించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. గతేడాది నల్గొండ జిల్లాలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగితే ఈ సంవత్సరం కృష్ణా నదిలో పుష్కలంగా నీళ్లు రావడం వల్ల ఐదున్నర లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. సాగు పెరిగిన కారణంగా నల్గొండ జిల్లాలో ఏడున్నర మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంచనా వేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మూడు లక్షల మెట్రిక్ టన్నులు కూడా కొనుగోలు చేసే పరిస్థితి నల్గొండ జిల్లాలో లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధాన్యం దళారుల పాలయిందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
సకాలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేక, గన్నీ బస్తాలు అందించలేక రైతులను ఇబ్బంది పెడుతున్నారు. రైతులు రూ .1800లకు క్వింటాల్ చొప్పున దళారులకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నాను ఎన్నికల ముందు బాండ్ పేపర్ రాసి రైతులకు 500 బోనస్, 15000 రైతుబంధు ఇస్తానని చెప్పి మాట తప్పవా లేదా? రైతుల వడ్ల లోడ్ ఎత్తమంటే మహారాష్ట్రకు నోట్లో కట్టల లోడ్ ఎత్తుతున్నాడు ముఖ్యమంత్రి. నల్గొండ జిల్లాలో 9,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే, రూ. 200 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంటే అందులో రూ. 50 కోట్లు మాత్రమే చెల్లించారు. రైతులకు సకాలంలో డబ్బులు అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని హరీశ్‌రావు తెలిపారు.
వడ్లకు మద్దతుధర వస్తలేదని రైతులు మిర్యాలగూడలో రాస్తారోకో చేసిన పరిస్థితి. కొన్న వడ్లకు కూడా విపరీతంగా తరుగు పెట్టి రైతులను తీవ్ర ఇబ్బంది పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. నిన్న జగిత్యాల జిల్లా పర్యటనలో అక్కడి రైతులని అడిగితే ఒక కిలో సన్నవడ్లు కూడా కొనలేదని చెప్పారు. ఇప్పటివరకు నల్గొండ జిల్లాలో కూడా ఒక కిలో సన్న వడ్లను కొనలేదు. సన్న వడ్లను కొనే వ్యవస్థ ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ విఫలమైందని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
KTR | అనుముల కుటుంబ కుంభకోణాలు బయటపెట్టేందుకే ఢిల్లీకి వెళ్లాను : కేటీఆర్
KTR | కొడంగల్ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరతం పడుతాం.. హెచ్చరించిన కేటీఆర్
KTR | అల్లుడి కంపెనీ కోసం.. రైతులపై రేవంత్ రెడ్డి దౌర్జన్యాలు..! కేటీఆర్ ధ్వజం