KTR | హైదరాబాద్ : నేను ఢిల్లీకి వెళ్లింది అనుముల కుటుంబ కుంభకోణాలు బయటపెట్టేందుకు వెళ్లాను. మళ్లీ కూడా కుంభకోణాలను బయటపెడుతూనే ఉంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కొడంగల్‌లో ప్రజల తిరుగుబాటు, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అంశం, రాష్ట్రంలో భూసేకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దురాగతాలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
నేను ఢిల్లీకి వెళితే బీజేపీతో కాళ్ల బేరానికి వెళ్లినట్లా..? మరీ బీజేపీకే చెందిన గవర్నర్‌ను రేవంత్ రెడ్డి కలిస్తే అది కాళ్ల బేరానికి వెళ్లినట్లు కాదా..? అదానీ కాళ్లు పట్టుకొని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన మీద ఈడీ కేసు కాకుండా చూసుకున్నాడా..? లేదా..? చెప్పండి. నేను మలేషియా వెళ్లకుండానే వెళ్లినట్లు మీడియా వాళ్లు ఎలా రాస్తారు..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ తుగ్లక్ ప్రభుత్వం నిర్ణయం కారణంగా అధికారులు బలి అవుతున్నారు. ప్రభుత్వం కుట్రలో అధికారులు బలి కావద్దని కోరుతున్నా. కొడంగల్‌లో రైతులతో భూసేకరణ పంచాయితీ వచ్చినప్పుడు పిలిచి మాట్లాడని కుసంస్కార ప్రభుత్వం ఇది.
మా ప్రభుత్వంలో కూడా భూ సేకరణ సమస్యలు వస్తే రైతులను మెప్పించి ఒప్పించి, వాళ్ల కడుపులో తల పెట్టి మేము మంచి పరిహారం ఇచ్చాం. మల్లన్న సాగర్ వంటి ప్రాజెక్టును పూర్తి చేశాం. కానీ ఈ ముఖ్యమంత్రికి 9 నెలలుగా కొడంగల్‌లో ఆందోళన చేస్తున్న రైతులను కలిసే సమయం లేదని కేటీఆర్ మండిపడ్డారు.
కలెక్టరే స్వయంగా దాడి జరగలేదని చెబుతున్నాడు. ఐజీ మాత్రం దాడి జరిగిందంటున్నారు. కానీ ఇది ఇంటలిజెన్స్ వైఫల్యం. దాడి జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ ఏదీ? ఉద్దేశ పూర్వకంగా గొడవ సృష్టించి రైతులు భూసేకరణకు సహకరించటం లేదని భూములను గుంజుకునే కుట్ర చేస్తున్నారు. ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ ఫార్ములా, బ్యాగ్‌ల ఫార్మూలా మాత్రమే తెలుసు. ఈయనకు ఈ రేస్ అంటే ఏంటో తెలుసా..? అని ప్రశ్నించారు.
11 నెలలుగా రోజుకో కుంభకోణం పేరుతో టైంపాస్ ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని మీడియా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మేము తప్పకుండా లగచర్ల రైతులకు అండగా ఉంటాం. ఆ ప్రాంతానికి మా పార్టీ నాయకులం వెళ్తాం.
పీడిత, గిరిజన రైతులకు మేము కచ్చితంగా అండగా నిలబడతాం. లంబాడా హక్కుల సమితి వాళ్లను కూడా కలిసి వాళ్లతో పోరాటం చేస్తాం. భూ సేకరణ పేరుతో రేవంత్ రెడ్డి కుటుంబం చేస్తున్న దోపిడీ ప్రజల ముందు పెడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | కొడంగల్ నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరతం పడుతాం.. హెచ్చరించిన కేటీఆర్
KTR | అల్లుడి కంపెనీ కోసం.. రైతులపై రేవంత్ రెడ్డి దౌర్జన్యాలు..! కేటీఆర్ ధ్వజం