KTR | హైదరాబాద్ : తన అల్లుడి కంపెనీ కోసమే రైతులపై సీఎం రేవంత్ రెడ్డి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ ఆదేశాలతో కొడంగల్ రైతులను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పోలీసులు.. రిమాండ్‌కు తరలిస్తుంటే రైతులు నడవలేకపోయారని కేటీఆర్ తెలిపారు. కొడంగల్‌లో ప్రజల తిరుగుబాటు, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అంశం, రాష్ట్రంలో భూసేకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దురాగతాలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
రైతులకు మెడికో లీగల్ పరీక్షలు వెంటనే చేయాలి.. ప్రభుత్వ వ్యవస్థ మీద నమ్మకం లేదు కాబట్టి ప్రైవేట్ డాక్టర్లతో పరీక్షలు నిర్వహించాలని మేజిస్ట్రేట్‌ను కేటీఆర్ కోరారు. ముఖ్యమంత్రి సోదరుడు తన్ని తీసుకుంటామని రైతులను బెదిరించిన ఆడియో ఉంది. ఫార్మా విలేజ్ వద్దని కొడంగల్ రైతులు సీఎం ను, మమ్మల్ని, బీజేపీ వాళ్లను కూడా కలిశారు. కొడంగల్ రగలుతుండటానికి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాలోచిత నిర్ణయాలే కారణం. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన చందంగా ఉంది ఈ ప్రభుత్వం తీరు అని కేటీఆర్ మండిపడ్డారు.
సొంత నియోజకవర్గంలో రైతులు అరెస్ట్ అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో ప్రచారానికి వెళ్లాడు. జాతీయ కాంగ్రెస్ నేతలకు తాబేదారుగా వ్యవహరిస్తూ ఇక్కడ పాలన గాలికి వదిలేశాడు. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయలేదు కిడ్నాప్ చేశారు. ఆయనేమైనా బందిపోటా? భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీ, పేద బీసీల భూములను రేవంత్ రెడ్డి తన అనుచరులు, కుటుంబ సభ్యులకు ఇచ్చి రియల్ ఎస్టేట్ దందా చేసే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొడంగల్‌లో ఇంటర్నెట్ను బంద్ పెట్టారు. అసలు ఇంటర్నెట్ బంద్ చేయటానికి వీలు లేదు. ఏ విధంగా పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. రైతులను లాక్కొని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేశారు. ఇంట్లో వేడుకలు, కార్యక్రమాలు ఉన్నప్పటికీ రైతులను అరెస్ట్ చేసి వాళ్లను ఇబ్బంది పెట్టారు. ఇది పేదలను ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం. ఇది ఊరికే నేను చెప్పటం లేదని కేటీఆర్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి అల్లుడికి చెందిన మ్యాక్స్ బీఎన్ కంపెనీ విస్తరణ కోసమే రైతుల భూములను తీసుకుంటున్నారు. అన్నం శరత్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. ఆయన మెడికవర్ హాస్పిటల్ ఓనర్. మెడికవర్ హాస్పిటల్ ఓవర్ అన్నం శరతే. ఆయన అల్లుడు, రేవంత్ రెడ్డి అల్లుడు ఇద్దరు ఒకే సంస్థలో డైరెక్టర్లు. వాళ్లిద్దరి కోసమే ఫార్మా విలేజ్ పేరుతో అక్రమాలు చేసేందుకు ముఖ్యమంత్రి కుట్ర చేస్తున్నాడు. బెంగళూరులోనూ మెడికవర్ హాస్పిటల్‌ను అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రారంభించారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | ముందుచూపుతోనే ముచ్చర్లలో ఫార్మా సిటీ : కేటీఆర్
Patnam Narender Reddy | డ్యామేజీ కంట్రోల్ కోసమే నన్ను అరెస్టు చేశారు : పట్నం నరేందర్ రెడ్డి