Petrol Price | చికాగో/టెహ్రాన్/న్యూఢిల్లీ, మార్చి 9: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు మంటల్ని రాజేసింది. ప్రపంచ చమురు ఉత్పత్తిలో కీలకమైన మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు.. అన్ని రకాల ఇంధన ధరల్ని ఎగదోస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర చాలాకాలం తర్వాత మళ్లీ 120 డాలర్లు పలికింది. దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటుండటం గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌ను షేక్ చేస్తున్నదిప్పుడు. అమెరికాకు మద్దతిస్తున్నారంటూ పొరుగున ఉన్న ఖతార్, కువైట్, యూఏఈ, సౌదీ, బహ్రెయిన్, ఇరాక్ తదితర గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే.
దీంతో ఆయా దేశాలు ముడి చమురు, గ్యాస్ ఉత్పత్తిని దాదాపుగా ఆపేయాల్సిన దుస్థితి ఏర్పడింది. మరోవైపు క్రూడ్ ఆయిల్, గ్యాస్ సరఫరాకు ప్రధానమైన హొర్ముజ్ జలసంధిలోని తమ భూభాగాన్ని ఇరాన్ మూసేసింది. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే సరుకు రవాణాకు బ్రేకులుపడ్డాయి. నౌకలపై ఇరాన్ దాడులు చేస్తున్నది మరి. హొర్ముజ్ జలసంధి మీదుగా రోజూ 15 మిలియన్ బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ రవాణా అవుతుంది. ఇది ప్రపంచ రోజువారీ ముడి చమురు రవాణాలో 20 శాతానికి సమానం. ఈ నేపథ్యంలోనే డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ముడి చమురు రేట్లు అంతకంతకూ పెరుగుతూ పోతున్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్‌గా అలీ ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఎన్నికైన నేపథ్యంలో యుద్ధం తీవ్రరూపం దాల్చుతున్నది. ఈ ఎన్నికను అంగీకరించని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌పై దాడుల్ని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో మున్ముందు ధరలు ఇంకా పెరుగవచ్చన్న అంచనాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అమెరికాలో ఉత్పత్తయ్యే ముడి చమురు ధర సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు దీనికి కూడా డిమాండ్ పెరుగుతున్నది. దీంతో బ్యారెల్ 119.48 డాలర్లదాకా ఎగిసింది. మరోవైపు ఇరాన్‌లోని చమురు క్షేత్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుండటంతో, ఇరాన్ సైతం ఆ రెండు దేశాల మద్దతుదారులకు అదేవిధంగా బదులిస్తున్నది. బహ్రెయిన్ రిఫైనరీ కాంప్లెక్స్‌లపై ఇరాన్ దాడులు చేసింది. దీంతో చమురు ఉత్పత్తి, రవాణా రెండింటికీ విఘాతం కలుగుతున్నది.
పశ్చిమాసియా సంక్షోభం.. భారతీయ వ్యాపారావకాశాలనూ దెబ్బతీస్తున్నది. దేశీయంగా విద్యుదుత్పత్తి, ఎరువుల తయారీ, సీఎన్జీ పంపిణీ, వంటగ్యాస్ నెట్‌వర్క్‌లకు ఎల్ఎన్జీ కీలకమవగా.. ఖతార్ నిర్ణయంతో ఆయా రంగాలు ఇబ్బందుల్లోపడ్డాయి. అలాగే భారత్ నుంచి విదేశాలకు జరుగుతున్న ఔషధాలు, శుద్ధిచేసిన పెట్రో ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తుల ఎగుమతులకూ అంతరాయం కలుగుతున్నది. గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణంతో చుట్టూ తిరిగి సరుకు రవాణా చేయాల్సి వస్తున్నది. దీంతో రవాణా వ్యయం, బీమా ఖర్చులు పెరుగుతున్నాయి. ఏదిఏమైనా తాజా పరిస్థితులు భారతీయ వృద్ధిని బలి తీసుకుంటున్నాయని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
దేశీయ ఇంధన అవసరాలు దాదాపు 88 శాతం దిగుమతుల ద్వారానే తీరుతుండగా.. ఇందులో మెజారిటీ భాగం గల్ఫ్ దేశాల నుంచే వస్తున్నది. అయితే ఈ యుద్ధంతో ఆయా దేశాల నుంచి రవాణా ఆగిపోయింది. మరోవైపు అమెరికా టారిఫ్‌ల దెబ్బకు ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి రష్యా నుంచి ముడి చమురు దిగుమతుల్ని మోదీ సర్కార్ తగ్గించేసింది.
ఫలితంగా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఇప్పుడు భారత్ పరిస్థితి అన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే రష్యా నుంచి చమురు దిగుమతుల్ని పునరుద్ధరించే దిశగా అడుగులు పడుతున్నప్పటికీ.. మునుపటి స్థాయిలో రవాణా పుంజుకోవడానికి సమయం పట్టవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగడం ఖాయంగానే కనిపిస్తున్నది. ఇప్పటికే వంటగ్యాస్ ధర పెరిగిన సంగతి విదితమే. ఖతార్ నుంచి ఎల్ఎన్జీ సరఫరాలో అంతరాయమే కారణంగా కనిపిస్తున్నది. భారతీయ సహజ వాయువు దిగుమతుల్లో ఖతార్‌దే అగ్రభాగం. ఇరాన్ డ్రోన్ దాడుల దృష్ట్యా గ్యాస్ ఉత్పత్తిని ఆపేసినట్టు ఖతార్ ప్రకటించింది.
దీంతో భారత్‌కు వచ్చే గ్యాస్ సరఫరాలో 40 శాతం వరకు తగ్గిపోయినట్టేనని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. ఏటా భారత్‌కు విదేశాల నుంచి వస్తున్న ద్రవరూప సహజ వాయువు (ఎల్ఎన్జీ)లో దాదాపు 27 మిలియన్ టన్నులు ఖతార్ నుంచే వస్తున్నది. ఇది మొత్తం దేశానికయ్యే సరఫరాలో 40 శాతానికి సమానం. ఇక త్వరలో పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన ధరలూ ఎగబాకే అవకాశాలున్నాయి. దేశంలోని ముడి చమురు, శుద్ధి చేసిన పెట్రో ఉత్పత్తుల నిల్వలన్నింటిని కలిపినా 6-8 వారాల అవసరాలకే సరిపోతాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలే చెప్తున్న పరిస్థితి.