Patnam Narender Reddy | సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌లో రైతుల తిరుగుబాటుతో రేవంత్ రెడ్డి కంగుతిన్నారని అన్నారు. ఆ డ్యామేజీ కంట్రోల్ కోసమే లగచర్లలో జరిగిన ఘటనను బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే కుట్రలో భాగంగానే తనను అరెస్టు చేశారని పేర్కొన్నారు.
ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని పట్నం నరేందర్ రెడ్డి తెలిపారు. సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారిందని విమర్శించారు. ప్రభుత్వం బాధ్యత మరిచినప్పుడు ప్రతిపక్షం ప్రశ్నిస్తూనే ఉంటుందని.. అది తప్పా అని ప్రశ్నించారు.
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం అధికారులపై దాడి ఘటనపై ఆ అర్ధరాత్రి నుంచే పోలీస్ యాక్షన్ షురూ అయింది. అర్ధరాత్రి వేళ.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేసి.. సుమారు 300 మంది పోలీసులు 55 మందిని పట్టుకొని బంధించారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం 16 మంది రైతులకు కోర్టుకు రిమాండ్ చేశారు. వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వగా, పరిగి సబ్ జై లుకు తరలించారు. అలాగే బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ వద్దకు వాకింగ్‌కు వచ్చిన పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. కాగా, నరేందర్ రెడ్డి అరెస్టుపై బీఆర్ఎస్ భగ్గుమంది. కొడంగల్ నియోజకవర్గవ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చింది.