హనుమకొండ చౌరస్తా, మార్చి 4: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. సుదూర ప్రాంతాల నుంచి చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు విద్య అందని ద్రాక్షలా మారింది. సౌకర్యాలలేమితో కనీసం తాగడానికి తాగునీరు లేక, బాత్రూంల్లో చుక్క నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. క్లాసులు చెప్పకుండా ప్రొఫెసర్లు కాలయాపన చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 1972లో ఆర్ట్స్ అండ్ కామర్స్‌లో యూజీ ప్రోగ్రామ్‌లను డిగ్రీ కోర్సులుగా ప్రారంభించి, తర్వాత సంవత్సరాల్లో పీజీ కాలేజీగా ఎదిగింది. ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాలేజీ, తెలంగాణ రాష్ట్రంలోని 133 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 3,800 మంది విద్యార్థులతో అత్యంత డిమాండ్ ఉన్న కాలేజీ.
మందుబాబులకు అడ్డాగా కాలేజీ..
సరిపడా తరగతి గదులు లేకపోవడంతో ఉదయం సైన్స్విద్యార్థులకు, మధ్యాహ్నం ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులకు సెషన్ల వారీగా విద్యనందిస్తున్నారు. ఈ కాలేజీలో 39 యూజీ కోర్సులో, 6 పీజీ కోర్సులను అందిస్తుండగా అధ్యాపకులు మాత్రం పాఠాలు చెప్పకుండా టైంపాస్ చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పచ్చని వాతావరణంలో విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు చెత్తాచెదారం, అధ్వానంగా తయారైన కాలేజీలో చదువుకుంటున్నారు.
పైన రేకుల షెడ్డు కింద రెండు తరగతులు ఉన్నాయని, ఎండాకాలం వస్తే తీవ్రమైన ఎండవేడిమి కూర్చోలేకపోతున్నామని, సమస్యలపై పలుమార్లు ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించు కోవడంలేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు మారుతున్నా మా సమస్యలు పరిష్కారం కావడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క వాచ్మెన్ లేరు, కాలేజీ మందుబాబులకు అడ్డాగా మారిందన్నారు. సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు ఇటీవల ప్రిన్సిపాల్ ఛాంబర్లో ఆందోళనకు దిగారు.
చాక్‌పీస్ పట్టుకోని ప్రొఫెసర్లు..!
కేడీసీలో అధ్యాపకులు పాఠాలు చెప్పకుండా కాలయాపన చేస్తున్నారని విద్యార్థులు మండిపడుతున్నారు. కనీసం ఒక్కనాడు చాక్‌పీస్ పట్టుకుని క్లాసులు చెప్పని ప్రొఫెసర్లు కూడా ఈ కాలేజీలో ఉన్నారని, లక్షలు లక్షలు జీతాలు తీసుకుంటూ క్లాసులు చెప్పడంలేదని విద్యార్థులు ఇటీవల ఆందోళనకు దిగారు. అధ్యాపకులు ఏసీ గదుల్లో కూర్చుని లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారని మండిపడుతున్నారు.
ప్రిన్సిపాల్ సైతం అధ్యాపకులతో కుమ్మక్కై పట్టించుకోవడంలేదని, అధ్యాపకులు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో తెలియదని పేరుకే ఫేస్ రిగ్నరైజేషన్ ఉన్నప్పటికీ అలా వచ్చి వెళ్లిపోతున్నారని ఆరోపిస్తున్నారు. 3 గంటల తర్వాత ఫోన్లు పట్టుకునే ఉంటున్నారని వాపోతున్నారు.
రెండు క్లాసులను కలిసి ఒకటి సెమినార్ హాల్ చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధ్వానంగా బాత్రూంలు..
అమ్మాయిలకు, అబ్బాయిలు వాష్‌రూంలు లేవని ఉన్నా వాటికి సరిపడా సదుపాయాలు లేవని, పాములు, తేళ్లు వస్తున్నాయని, బాత్రూంల్లో నీళ్లు లేవని పోవడానికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వాపోతున్నారు. బాత్రూంల్లో ఉన్న ట్యాప్స్ఎత్తుకుపోవడంతో ట్యాంకుల్లో ఉన్న నీళ్లు వృథాగా పోయి బాత్రూంల్లో నీళ్లు ఉండటంలేదని విద్యార్థులు ఆరోపించారు.
వేల మంది విద్యార్థులు ఉన్న ఈ కాలేజీలో కేవలం మూడు బాత్రూంలు ఉండటం, అవి కూడా అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాత్రూంలు లేని కాలేజీల్లో మహిళలు చదువుకుంటారని, ప్రిన్సిపాల్‌కి చెబితే పట్టించుకోవడంలేదని, చేస్తా, చూస్తానంటూ దాట వేస్తున్నారని మండిపడుతున్నారు.
కలెక్టర్ కాలేజీని సందర్శించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
పాఠాలు చెప్పనివారిపై చర్యలు : ఎన్.శ్రీనివాస్, కేడీసీ ప్రిన్సిపాల్
కాకతీయ డిగ్రీ కాలేజీలో 125 మంది రెగ్యులర్, కాంట్రాక్టు, పార్ట్‌టైం అధ్యాపకులు ఉన్నారు. కాలేజీకి వచ్చి పాఠాలు చెప్పని అధ్యాపకులపై చర్యలు తీసుకుంటా. విద్యార్థులకు ముఖ్యంగా వాటర్ ప్రాబ్లమ్ ఉంది. ట్యాప్స్ ఎత్తుకెళ్తున్నారు. బాత్రూంల్లో ఉన్న ట్యాప్స్ ఎత్తుకుపోవడంతో ట్యాంకుల్లో ఉన్న నీళ్లు వృథాగా పోయి బాత్రూంల్లో నీళ్లు ఉండటంలేదు. కొత్తవి పెట్టినప్పటికీ మళ్లీ అదే సమస్య ఉత్పన్నమవుతున్నది. వీటిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

కాలేజీ ఆవరణలో పేరుకుపోయిన చెత్తా చెదారం..

Kd1