మాస్కో: ఉక్రెయిన్ భారీ సంఖ్యలో డ్రోన్లతో రష్యాపై అటాక్(Drones Attack) చేసింది. యరోస్లావిల్ సిటీపై జరిగిన దాడిలో ఆయిల్ రిఫైనరీ దెబ్బతిన్నది. ఆ నగరం నుంచి దట్టమైన నల్లటి పొగలు వ్యాపిస్తున్నాయి. తమ నగరంపై అతి పెద్ద అటాక్ జరిగినట్లు గవర్నర్ మైఖస్త్రల్ ఎవ్రేవ్ తెలిపారు. సుమారు 92 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు ఆయన చెప్పారు. రష్యాలో ఉన్న అతిపెద్ద 5 ఆయిల్ రిఫైనరీల్లో ఇదొకటి. మరో వైపు రష్యా చేసిన దాడిలో బాలక్లియా సిటీలో ముగ్గురు మృతిచెందినట్లు ఉక్రెయిన్ తెలిపింది. 12 మంది గాయపడ్డారు.
ఉక్రెయిన్ వదిలిన సుమారు 605 డ్రోన్లను రాత్రికి రాత్రే కూల్చినట్లు రష్యా ప్రకటించింది. అనేక ప్రాంతాలపై డ్రోన్ దాడులు జరిగాయి. మాస్కోతో పాటు నల్ల సముద్ర ప్రాంతంతో పాటు యరస్లావిల్ ఆయిల్ రిఫైనరీపై అటాక్ జరిగింది. ఈ ఆయిల్ రిఫైనరీలో ప్రతి ఏడాది సగటున 15 మిలియన్ల టన్నుల క్రూడ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తారు. యరోస్లావి పట్టణంలో ఉన్న స్లావ్నెఫ్ట్-యానోస్ రిఫైనరీగా పిలుస్తారు.
ఉక్రెయిన్ బోర్డర్ వందల మైళ్ల దూరంలో ఉంటుంది. 1961లో ఈ రిఫైనరీని నిర్మించారు. కార్లు, విమానాలతో పాటు ఇతర అవసరాలు తీర్చేందుకు ఇక్కడ ఇంధనాన్ని తయారు చేస్తారు.