– సూర్యాపేట జిల్లా ఉద్యాన అధికారి తీగల నాగయ్య
అర్వపల్లి, సెప్టెంబర్ 22 : ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసినట్లు అయితే రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అని సూర్యాపేట జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి తీగల నాగయ్య అన్నారు. అర్వపల్లి మండల పరిధిలోని అర్వపల్లి, తిమ్మాపురం గ్రామాల్లో సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. మార్కెట్లో డిమాండ్ ఉన్న అయిల్ పామ్ తోటలను సాగు చేసి రైతులు ఆర్థికoగా అభివృద్ధి చెందవచ్చు అన్నారు. ఆయిల్ పామ్ తోట నాటిన నాల్గొవ సంవత్సరం నుంచి దిగుబడి ప్రారంభమవుతుందన్నారు. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం బిందు సేద్యం, ఎరువులకి, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు. ఎరువులు, అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూ.4,200/- చొప్పున మొదటి నాలుగు సంవత్సరాలు ప్రోత్సాహకం ఇవ్వబడుతుందని తెలిపారు.
గరిష్టంగా ఒక రైతుకు 12:50 ఎకరాల వరకు డ్రిప్పు రాయితీ వర్తిస్తుందని నమ్మకమైన నీటి వసతి గల రైతులు లాభదాయకమైన ఆయిల్ పామ్ పంటను సాగు చేసి, అధిక ఆదాయం పొందవచ్చునని తెలిపారు. ఒక ఎకరానికి దిగుబడి పది టన్నుల వరకు వస్తుందని మొదటి నాలుగు సంవత్సరాల వరకు అంతర పంటలుగా ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న కూరగాయలను, వాణిజ్య పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. ఆయిల్ పామ్ తోటలు సాగు చేయాలనుకున్న ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ ఉద్యాన అధికారిని వంగూరీ ప్రమిత, ఉద్యాన విస్తరణ అధికారులు రంగు ముత్యంరాజు, కట్టగూరి రాము, వంగూరి అనిల్, రైతులు పాల్గొన్నారు.