– సీఐటీయూ నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండీ.సలీమ్
కనగల్, ఆగస్టు 06 : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా.. కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తున్నందున వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10న దేశ వ్యాప్తంగా జైల్ బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎండీ సలీమ్ తెలిపారు. గురువారం కనగల్లు మండల కేంద్రంలో జైల్ బరో కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ప్రధానంగా నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మికులకు నష్టం కలిగించే విధంగా 8 గంటల పనిని 12 గంటల వరకు పెంచుకునేందుకు యాజమాన్యాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. అదేవిధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం స్థానంలో విబి జి రాంజీ పథకం తీసుకొచ్చి ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడిచారన్నారు.
రైతులకు నష్టం కలిగించే విధంగా నూతన విద్యుత్ చట్టం, విత్తన సవరణ చట్టం తీసుకొచ్చారని దీనివల్ల రైతులకే కాకుండా వినియోగదారులకు కూడా నష్టం కలుగుతుందని తెలిపారు. అందుకని ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నందున వాటిని ఉపసంహరించుకోవాలని తెలియజేస్తూ రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున జైల్ బరో కార్యక్రమం సందర్భంగా మండల కేంద్రంలో జరిగే నిరసన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దండెంపల్లి సత్తయ్య, లకపాక రాజు, మండల కన్వీనర్ నెలగొందరాసి లింగయ్య, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు సూరారం జంగయ్య, హమాలీ యూనియన్ అధ్యక్షుడు పిన్నపురెడ్డి శేఖర్ రెడ్డి, వి జనార్దన్, పేద్దగోని భిక్షం, విజయ్ పాల్గొన్నారు.