Kerala rains : కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, కొండచరియలు విరిగిపడటం కారణంగా ఐదుగురు మరణించారు. ఇద్దరు గాయపడ్డారు. వర్షాలు, వరదలు వంటి విపత్తులపై కేరళ సీఎం వీడీ సతీషన్ స్పందించారు. వెంటనే సహాయక, సంరక్షణ చర్యలు చేపట్టాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించారు. ఆదివారం అధికారులకు ఈ అంశంపై ఆదేశాలు జారీ చేశారు. ఇడుక్కి, కొట్టాయం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దీంతో కొన్నిచోట్ల ఆకస్మిక వరదలు సంభిస్తున్నాయి. కొండ చరియలు విరిగిపడటం, బురద పేరుకుపోవడం వంటివి జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కమిషనర్ విగ్నేశ్వరి.. ఆయా జిల్లాల కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. దీంతో కలెక్టర్లు, ఇతర అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. స్తానిక ప్రజలకు వాతావరణ పరిస్తితులపై ఎప్పటికప్పుడు మెసేజ్లతో అలర్ట్ చేస్తున్నారు. వరద ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మలప్పురం జిల్లాలోని కొట్టాపుల నదిలో నిలాంబుర్-అమరాంబలం ప్రాంతంలో ఐదుగురు నదిలో కొట్టుకుపోయారు.
నదిలో నీటి ఉధృతి ఉన్నట్లుండి పెరగడంతో వరదల్లో వీరు కొట్టుకుపోయారు. వీరిలో ఇద్దరు మరణించారు. ఒక వ్యక్తిని స్థానికులు రక్షించారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇద్దరి మృతదేహాల్ని వెలికితీసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న సీఎం.. సహాయక చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు తమిళనాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం జిల్లాలో కొండ చరియలు విరిగిపడటంతో ఒక మహిళ మరణించింది.