Ustaad Bhagat Singh | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అభిమానుల్లో అంచనాలు ఎప్పటిలాగే ఆకాశాన్ని తాకుతున్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్స్కు కేరాఫ్ అడ్రెస్‌గా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ప్రాజెక్ట్‌కు ఫుల్ హైప్ వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, పవన్ లుక్ సినిమాపై భారీ ఆసక్తిని రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించే బాధ్యతల నుంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మార్పు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది.
గతంలో కూడా ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2: ది రూల్’ విషయంలో కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంశం పెద్ద చర్చకు దారితీసింది. ఆ చిత్రానికి థమన్‌తో పాటు సామ్ సి.ఎస్ కలిసి పని చేయడం అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు అదే తరహా సీన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలోనూ రిపీట్ అవుతుండటంతో సినీ అభిమానులలో ఆసక్తి మరింత పెరిగింది. మరో విశేషం ఏమిటంటే, ఈ రెండు భారీ చిత్రాలను కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. వరుసగా రెండోసారి మ్యూజిక్ విభాగంలో ఇలాంటి మార్పులు చోటుచేసుకోవడం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? ఫైనల్ అవుట్‌పుట్ కోసం తీసుకున్న క్రియేటివ్ డెసిషనా? లేక మరేదైనా కారణమా? అనే ప్రశ్నలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ వార్త నిజమైతే, పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా థమన్ అందించే ఎలివేషన్స్ ఎలా ఉండబోతున్నాయో అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరిగింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని మార్చి 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి మ్యూజిక్ డైరెక్టర్స్ మార్పు నిజమేనా? లేదా ఇది కేవలం ప్రచారమేనా? అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానుంది.