హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): విజయ డెయిరీ బ్రాండ్ దుర్వినియోగంపై తెలంగాణ, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ల మధ్య వివాదం ముదురుతున్నది. తెలంగాణలో ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఎలాంటి సహకార సంఘాలు లేనప్పటికీ.. ప్రైవేటు వ్యక్తులకు దాని ఫ్రాంచైజీని ఇచ్చారు. దీంతో వారు పాలు, నెయ్యిని కల్తీ చేసి అమ్ముతున్నారని, ఫలితంగా తెలంగాణ విజయ డెయిరీ బ్రాండ్‌కు నష్ట వాటిల్లుతున్నదని సంస్థ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వానికి, ఏపీడీడీసీఎఫ్‌కు లేఖలు రాసినప్పటికీ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదిలాఉండగా, తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన ఆరోపణలను ఏపీడీడీసీఎఫ్ తప్పుపట్టింది. ఇప్పటివరకు విజయ డెయిరీ నెయ్యి, పాలలో ఎలాంటి కల్తీ జరగలేదని తెలిపింది. అయితే తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపామని, నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.
ఈ నేపథ్యంలో గుత్తా అమిత్‌రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. ప్రైవేట్ వ్యక్తులు విజయబ్రాండ్ పేరుతో కల్తీ నెయ్యి విక్రయిస్తున్నారని చెప్పారు. తెలంగాణ విజయ డెయిరీకి ఉన్న నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, ఏపీకి చెందిన ప్రైవేట్ యూనియన్లు ఇకడ తకువ నాణ్యత గల పాలను విక్రయిస్తున్నాయని తెలిపారు. మేఘన ఫుడ్స్ సంస్థకు విజయ డెయిరీ ఫ్రాంచైజీ ఇవ్వగా, అది గుజరాత్‌లోని కన్హాన్ డెయిరీ నుంచి నెయ్యి సేకరించి తెలంగాణలో విక్రయిస్తున్నదని చెప్పారు. ఈ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసినట్టు నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (ఎన్డీడీబీ) నివేదిక ఇచ్చిందని వివరించారు. విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో హైదరాబాద్ మారెట్లో నెలకు 100 టన్నులకుపైగా నెయ్యి విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రైవేట్ సంస్థలు విజయ డెయిరీ లోగోను అక్రమంగా వినియోగించడం వల్ల తెలంగాణ, ఏపీ పాడి రైతులకు రావాల్సిన ఆదాయానికి గండిపడుతున్నదని అన్నారు. డెయిరీ ఫెడరేషన్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వ బ్రాండ్లను వాడుకోవడానికి వీల్లేదని, ఈ విషయమై ఏపీ డెయిరీకి ఎన్ని లేఖలు రాసినా స్పందన లేదని అసహనం వ్యక్తం చేశారు.