P Chidambaram : ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన ‘దిమాగీ నక్సలిజం (మేధోపరమైన నక్సలిజం) (Dhimagi Naxalism)’ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్‌గా తాను ‘గర్వపడే దిమాగీ నక్సల్ (Proud to be a Dimagi Naxal)’ అని కాంగ్రెస్ సీనియర్ నేత (Congress Senior Leader), కేంద్ర మాజీ మంత్రి (Former Union Minister) పీ చిదంబరం (P Chidambaram) ప్రకటించారు.
ప్రధాని చేసిన వ్యాఖ్యల అనంతరం ఆదివారం చిదంబరం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా స్పందించారు. “నేను గర్వపడే దిమాగీ నక్సల్‌ను!” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. దేశంలో సాయుధ నక్సలిజాన్ని బలహీనపరచడంలో గణనీయమైన పురోగతి సాధించామని తెలిపారు. అయితే ‘దిమాగీ నక్సలిజం’ రూపంలో ఒక కొత్త సవాల్ పొంచి ఉందని హెచ్చరించారు.
కాగా ‘అడవుల్లో సాయుధ నక్సల్స్‌ను మనం వదిలించుకున్నాం. కానీ హింస, అశాంతిని సృష్టించడానికి ‘దిమాగీ నక్సల్స్’ అవకాశాల కోసం చూస్తున్నారు. వారు సమాజాన్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు. ఈ ‘దిమాగీ నక్సల్స్’ ను గుర్తించి, వారిని ఏకాకులను చేయాలి. యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి’ అని ప్రధాని మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
రాజకీయ ప్రత్యర్థులపై ప్రధాని మోదీ రెచ్చగొట్టే పదజాలాన్ని వాడుతున్నారని, ఇది ఆయనలోని రాజకీయ నిస్పృహను ప్రతిబింబిస్తోందని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ కూడా ప్రధాని వ్యాఖ్యలను తప్పుబట్టారు. గతంలో ఆయన ఉపయోగించిన ‘అర్బన్ నక్సల్స్’ పదాన్ని గుర్తుచేశారు. “మొదట ఆయన తన ప్రత్యర్థులను ‘అర్బన్ నక్సల్స్’ అన్నారు. ఇప్పుడు ‘దిమాగీ నక్సల్స్’ అంటున్నారు. ఇది ఆయన నిరాశకు స్పష్టమైన సంకేతం” అని జైరామ్ రమేశ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.