కారేపల్లి,ఆగస్టు 16: ఖమ్మం జిల్లా సింగరేణి కారేపల్లి మండల పరిధిలోని గాంధీ పురంలో గల తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, కళాశాలలలో శనివారం అర్ధరాత్రి ర్యాగింగ్(Ragging) కలకలం రేపింది. ఆ పాఠశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులను ఒంటిమీద బట్టలు ఊడదీసి చితకబాదారు. స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకొని పాఠశాలలో విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహించారు. అయితే వాలీబాల్, ఖోఖోలో ఇంటర్మీడియట్, కబడ్డీ లలో పదవ తరగతి విద్యార్థులు గెలుపొందారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గెలుపొందిన విద్యార్థులకు ఆగస్టు 15న ఉపాధ్యాయులు బహుమతులను ప్రదానోత్సవం చేశారు.
అనంతరం పదవ తరగతి విద్యార్థులు కబడ్డీలో గెలుపొందిన ఆనందంతో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అదంతా చూసి తట్టుకోలేని ఇంటర్మీడియట్ విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులను అర్ధరాత్రి గదిలోకి తీసుకువెళ్లి ర్యాగింగ్ చేసి చితకబాదారు. భయాందోళనకు గురైన 10వ తరగతి విద్యార్థులు స్టడీ అవర్ లో ఉన్న నైట్ డ్యూటీ ఉపాధ్యాయుడికి సమాచారం ఇచ్చారు. అంతటితో ఆగని ఇంటర్మీడియట్ విద్యార్థులు పదో తరగతి స్టూడెంట్స్ ని పరిగెత్తించి మరీ కొట్టారు. రాత్రంతా రైల్వే స్టేషన్, సమీప అటవీ ప్రాంతంలో ఉన్న 10వ తరగతి విద్యార్థులు తెల్లవారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరించారు. దీంతో అక్కడికి చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న కారేపల్లి పోలీసులు పాఠశాలకు చేరుకొని విచారణ చేపట్టారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న పాఠశాల ప్రిన్సిపల్ పై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.