Hepatitis | చాలా మందికి కాలేయ వ్యాధి అంటే వయసు పైబడిన వారిలో లేదా అధికంగా మద్యం సేవించే వారిలో వచ్చే సమస్యగా భావిస్తారు. అయితే ప్రస్తుతం 20, 30 ఏళ్ల వయసులో ఉన్న యువతలోనూ ఎలాంటి స్పష్టమైన లక్షణాలు కనిపించకుండానే కాలేయం దెబ్బతింటున్న ఘటనలు పెరుగుతున్నాయి. దీనికి ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తున్న కారణాల్లో వైరల్ హెపటైటిస్ ఒకటి. హెపటైటిస్‌ను చాలా వరకు నివారించవచ్చు. అలాగే అనేక సందర్భాల్లో సమర్థవంతంగా చికిత్స చేయవచ్చు. అయినప్పటికీ ఇది ఇప్పటికీ ప్రధాన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోంది. కాలేయం ఎంతో దృఢమైన అవయవం. గణనీయమైన స్థాయిలో నష్టం జరిగినప్పటికీ కొంతకాలం వరకు సాధారణంగానే పనిచేస్తుంది. అందువల్ల హెపటైటిస్ అనేక సంవత్సరాల పాటు ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే కొనసాగుతుంది.
దీర్ఘకాలిక హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి ఉన్న చాలామందికి తమకు ఇన్ఫెక్షన్ ఉన్న విషయం తెలియకుండానే ఉంటుంది. కాలేయ వ్యాధి ముదిరి సిరోసిస్ లేదా చివరకు కాలేయ క్యాన్సర్‌కు చేరుకున్న తర్వాతే సమస్య బయటపడే పరిస్థితులు ఉంటాయి. కామెర్లు, పొత్తికడుపు వాపు, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపించే సమయానికి కాలేయానికి గణనీయమైన, కొన్ని సందర్భాల్లో తిరిగి సరిచేయలేని నష్టం అప్పటికే జరిగి ఉంటుంది. దేశంలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధులకు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ముఖ్యమైన కారణాలుగా ఉన్నాయి. హెపటైటిస్ బి ప్రధానంగా ఇన్ఫెక్షన్ ఉన్న తల్లి నుంచి బిడ్డకు పుట్టిన సమయంలో సంక్రమిస్తుంది. రక్షణలేని లైంగిక సంబంధాలు, కలుషితమైన సూదులు, ఇన్ఫెక్షన్ ఉన్న రక్తంతో సంబంధం ఏర్పడటం ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుంది.
హెపటైటిస్ సి ప్రధానంగా ఇన్ఫెక్షన్ ఉన్న రక్తం ద్వారా వ్యాపిస్తుంది. సురక్షితం కాని ఇంజెక్షన్లు, సరిగా శుభ్రపరచని వైద్య లేదా సౌందర్య పరికరాలు, సాధారణ రక్త పరీక్షలు అందుబాటులోకి రాకముందు చేయించుకున్న రక్త మార్పిడులు ఇందుకు కారణం అవుతాయి. పరిశుభ్రత లేని పరిస్థితుల్లో టాటూలు లేదా శరీర భాగాలకు పియర్సింగ్ చేయించుకునే యువత, ఆరోగ్య రంగంలో పనిచేసేవారు, ఒకరి కంటే ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్నవారు, మత్తు పదార్థాలను ఇంజెక్షన్ల ద్వారా తీసుకునేవారు హెపటైటిస్ బి, సి ముప్పును ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెపటైటిస్‌ను గుర్తించడంలో ప్రధాన సవాలు ప్రారంభ దశలో కనిపించే లక్షణాలు చాలా సాధారణంగా ఉండటమే. స్వల్ప అలసట, ఆకలి తగ్గడం, అప్పుడప్పుడు వికారం లేదా సాధారణ ఆరోగ్య పరీక్షల్లో కాలేయ ఎంజైమ్‌లు కొద్దిగా పెరగడం వంటి మార్పులను చాలామంది పెద్దగా పట్టించుకోరు. వీటిని ఒత్తిడి, జీవనశైలి లేదా ఇతర సాధారణ కారణాలకు ఆపాదిస్తారు.
సాధారణ కాలేయ పనితీరు పరీక్షల ఫలితాలు సాధారణంగా ఉన్నంత మాత్రాన దీర్ఘకాలిక హెపటైటిస్ లేదని పూర్తిగా నిర్ధారించలేం. అందువల్ల ముప్పు ఉన్నవారు కేవలం సాధారణ రక్త పరీక్షలపై ఆధారపడకుండా హెపటైటిస్ బి, హెపటైటిస్ సి కోసం ప్రత్యేక పరీక్షలు చేయించుకోవడం అవసరం. హెపటైటిస్ కారణంగా జరిగే కాలేయ నష్టాన్ని చాలా వరకు నివారించవచ్చు. హెపటైటిస్ బికి టీకా అందుబాటులో ఉంది. ఇది దీర్ఘకాలిక రక్షణను అందిస్తుంది. ప్రతి శిశువుకూ పుట్టిన వెంటనే హెపటైటిస్ బి టీకా ఇవ్వడం చాలా ముఖ్యమైంది. ఇంతవరకు టీకా తీసుకోని పెద్దలు కూడా, ముఖ్యంగా అధిక ముప్పు ఉన్నవారు, వైద్యుల సలహాతో టీకా తీసుకోవడాన్ని పరిగణించాలి. హెపటైటిస్ సికి ప్రస్తుతం టీకా అందుబాటులో లేకపోయినప్పటికీ, అత్యంత ప్రభావవంతమైన నోటి ద్వారా తీసుకునే యాంటీవైరల్ మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధిని తొలిదశలో గుర్తిస్తే 95 శాతానికి పైగా ఇన్ఫెక్షన్లను నయం చేయవచ్చు. అదేవిధంగా దీర్ఘకాలిక హెపటైటిస్ బికి సరైన సమయంలో చికిత్స అందిస్తే వైరస్‌ను నియంత్రించవచ్చు. కాలేయంలో వాపును తగ్గించడంతోపాటు సిరోసిస్, కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
వైరల్ హెపటైటిస్తోపాటు యువతలో మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్ డిసీజ్, అంటే ఎంఏఎస్ఎల్డీ కేసులు కూడా పెరుగుతున్నాయి. గతంలో దీనిని ఫ్యాటీ లివర్ డిసీజ్‌గా పిలిచేవారు. ఊబకాయం, మధుమేహం, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఈ సమస్యకు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యాటీ లివర్, వైరల్ హెపటైటిస్ ఒకే వ్యక్తిలో కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఈ రెండు సమస్యలు కలిసినప్పుడు కాలేయ నష్టం మరింత వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. అందువల్ల కాలేయ పరీక్షల్లో మార్పులు కనిపించిన ప్రతిసారీ దానికి కారణం కేవలం ఫ్యాటీ లివర్ మాత్రమేనని భావించకుండా అసలు కారణాన్ని గుర్తించడం అత్యంత అవసరం. హెపటైటిస్ తరచూ ఎలాంటి లక్షణాలు లేకుండా ఉంటుంది. కానీ దానిని ఎప్పటికీ నిర్లక్ష్యం చేయకూడదు. కుటుంబంలో ఎవరికైనా హెపటైటిస్ బి ఉన్న చరిత్ర ఉంటే, గతంలో రక్త మార్పిడి చేయించుకుని ఉంటే, పరిశుభ్రత లేని ప్రదేశాల్లో టాటూలు లేదా పియర్సింగ్ చేయించుకుని ఉంటే లేదా ఇతర ముప్పు కారకాలు ఉంటే వైద్యుడిని సంప్రదించి హెపటైటిస్ పరీక్షలు చేయించుకోవాలి. సాధారణ రక్త పరీక్ష ద్వారా ఇన్ఫెక్షన్ను ముందుగానే గుర్తించడం వల్ల జీవితాంతం ఎదురయ్యే అనేక తీవ్రమైన సమస్యలను నివారించే అవకాశం ఉంటుంది.
యుక్త వయసులోనే కాలేయ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు ఎంతో ప్రయోజనకరం. టీకాలు తీసుకోవడం, అవసరమైన సమయంలో స్క్రీనింగ్ చేయించుకోవడం, సురక్షితమైన వైద్య విధానాలను పాటించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడం, వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా దశాబ్దాల పాటు కాలేయాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. హెపటైటిస్ నిశ్శబ్దంగా వస్తుంది. కానీ అవగాహన, ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్సతో దాని తీవ్ర పరిణామాలను మాత్రం నివారించవచ్చు.