Shah Rukh Khan | బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) షాక్ ఇచ్చింది. ఒక పాన్ మసాలా చ్యూయింగ్ ఇలాచీ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు గాను ఆగస్ట్ 14న ఎఫ్‌డీఏ ఈ నోటీసులు జారీ చేసింది. ఈ యాడ్స్ 2006 ఎఫ్ఎస్ఎస్ఐ చట్టాన్ని, దాని సవరించిన నిబంధనలను ఉల్లంఘించేలా ఉన్నాయని ఎఫ్‌డీఏ తన నోటీసులో పేర్కొంది.
మహారాష్ట్రలో నిషేధించబడిన పాన్ మసాలా, టొబాకో ఉత్పత్తులను పోలిన బ్రాండ్ పేరుతో ఇలాచీని ప్రచారం చేయడం ద్వారా పరోక్షంగా నిషిద్ధ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్నట్లు ఎఫ్‌డీఏ గుర్తించింది. అజయ్ దేవగన్‌కు జుహులోని ఆయన నివాసంలో, షారుఖ్ ఖాన్‌కు బాంద్రాలోని ‘మన్నత్’లో, అలాగే టైగర్ ష్రాఫ్‌కు ఆయన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ షోకాజ్ నోటీసులు అందజేశారు. సోషల్ మీడియా మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌ల నుంచి ఆ ప్రమోషనల్ కంటెంట్‌ను తొలగించాలని, దీనిపై తమ వివరణను 15 రోజుల్లోగా సమర్పించాలని ఆ నటులను ఎఫ్‌డీఏ ఆదేశించింది. నిబంధనలు పాటించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించింది.