హైదరాబాద్, మార్చి 9(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో డ్రగ్స్ దందా నానాటికీ పెరిగిపోతున్నది. మునుపెన్నడూ లేనివిధంగా గత రెండేండ్లలో ఇది మరింత ముదిరి విశృంఖల రూపం దాల్చడంతో సింథటిక్ డ్రగ్స్‌కు తెలంగాణ హాట్‌స్పాట్‌గా మారిందని ఈ ఏడాది జనవరి 9న ఢిల్లీలో జరిగిన 9వ అపెక్స్ లెవల్ ఎన్‌సీవోఆర్‌డీ సమావేశంలో నిఘా సంస్థలు తేల్చాయి. ఈ దందాను అరికట్టాలని స్వయం గా సీఎం రేవంత్‌రెడ్డిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశించినా మన ఈగల్ ఫోర్స్ మేల్కోవడం లేదు. ఇతర రాష్ర్టాల పోలీసులు వచ్చి తెలంగాణలో భారీగా డ్రగ్స్ పట్టుకుంటున్నా మనోళ్లలో చలనం లేదు. తాజాగా తెలంగాణలో సింథటిక్ డ్రగ్స్‌కు సంబంధించిన ముడిపదార్థాలు భారీగా తయారు చేస్తున్నారని రాజస్థాన్ పోలీసులు గుర్తించారు. వారు ఇచ్చిన సమాచారంతో నిద్రలేచిన ఈగల్ ఫోర్స్.. ఇటీవల షాద్‌నగర్‌లో ఎస్ఆర్ ఇన్నోవేషన్స్ కంపెనీలో సోదాలు చేపట్టి, మెఫెడ్రిన్ తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలను 300 లీటర్లకుపై స్వాధీనం చేసుకున్నారు.
రాజస్థాన్‌లో పట్టుబడితే.. తెలంగాణలో లింకులు
రాజస్థాన్‌లోని కోటా జిల్లాలో ఇటీవల డ్రగ్స్‌తో స్కార్పియో వాహనంలో వెళ్తున్న వీరేందర్స్వామి, మనీశ్ బిష్ణోయ్ అనే వ్యక్తులను అకడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించడంతో షాద్‌నగర్‌లోని డ్రగ్ ఫ్యాక్టరీ గుట్టురట్టయింది. ఇక్కడ తయారుచేసే ముడిపదార్థాలను రాజస్థాన్ సహా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నట్టు తేలింది. వాటితో ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లా ఖండౌలీలో ఓ షట్టర్ షాపు వెనుక మెఫెడ్రిన్ను తయారు చేస్తున్నట్టు వెల్లడైంది. అనంతరం రాజస్థాన్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో మనోళ్లు మేలుకున్నారు. పోలీసుల సహకారంతో ఈ నెల 6న ఈగల్ ఫోర్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. వీరేందర్స్వామితో కలిసి డ్రగ్స్ తయారు చేస్తున్న మనోజ్ కుమార్, సతీశ్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి 120 లీటర్ల మిథైలమైన్, 27.5 లీటర్ల హైడ్రోబ్రోమిక్ యాసిడ్ సహా సింథటిక్ డ్రగ్స్ తయారీకి వినియోగించే 300 లీటర్ల ముడిపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్ హాట్‌స్పాట్‌గా తెలంగాణ
కేంద్ర నిఘా సంస్థలు చెప్తున్నట్టు సింథటిక్ డ్రగ్స్‌కు తెలంగాణ హాట్‌స్పాట్‌గా మారిందని గతంలోనూ రుజువైంది. నిరుడు అక్టోబర్‌లో జీడిమెట్ల సుచిత్ర క్రాస్‌రోడ్స్ సమీపంలోని స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీలో నిర్వహించిన సోదాల్లో సాయిదత్తా రెసిడెన్సీ నుంచి రూ.72 కోట్ల విలువైన 220 కిలోల ఎఫెడ్రిన్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్‌ను ఏ1 నాణ్యత కలిగిన ఎఫెడ్రిన్గా గుర్తించారు. దీన్ని మెథాంఫెటమైన్ అనే డ్రగ్‌గా తయారు చేస్తే విలువ 10 రెట్లు పెరుగుతుందని గుర్తించిన ఈగల్ టీమ్.. అదే నెలలో 2,745 స్పస్మో-ప్రాక్సీవోన్ ప్లస్ అనే మత్తు టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నది.
రూ.12 వేల కోట్ల ముడిపదార్థాలు సీజ్
ముంబై పోలీసులు నిరుడు సెప్టెంబర్‌లో చర్లపల్లిలోని వాగ్దేవి కెమికల్స్ ల్యాబ్‌లో సోదాలు జరిపి ఏకంగా రూ.12 వేల కోట్ల విలువైన సింథటిక్ డ్రగ్స్ ముడిపదార్థాలతోపాటు రూ.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ముడిసరుకులో 5.790 కిలోల ఎండీ, 35,500 లీటర్ల రసాయనాలు, 950 కిలోల పౌడర్, డ్రగ్ తయారీకి ఉపయోగించే ఇతర పదార్థాలు ఉన్నాయి. నిందితుల వద్ద లభ్యమైన డ్రగ్‌ను అంతర్జాతీయంగా డ్రోన్, ఎం-క్యాట్, వైట్ మ్యాజిక్, మియావ్ మియావ్, బబుల్ లాంటి పేర్లతో పిలుస్తున్నట్టు గుర్తించారు. మెఫెడ్రోన్, యాంఫేటమిన్, కాథినోన్ తరగతులకు చెందిన ఈ సింథటిక్ డ్రగ్‌ను వాడినవారికి దాదాపు 24 గంటలపాటు మత్తు వదలదు.
డబ్బు కోసం ఈగల్ టీమ్ అధికారుల రాజీ: బండి సంజయ్
తెలంగాణ ఈగల్ ఫోర్స్ పనితీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇటీవల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం పండుగలు, నూతన సంవత్సరం వేడుకల సమయంలోనే డ్రగ్స్ కేసుల నమోదుకు పరిమితవుతున్నారని, ఈగల్ టీమ్‌లోని కొందరు అధికారులు డబ్బులకు అమ్ముడుపోయి డ్రగ్ పెడ్లర్లతో రాజీపడుతున్నారని గత డిసెంబర్ 27న ఓ ప్రకటనలో ధ్వజమెత్తారు. పెడ్లర్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినవారిని ఈగల్ టీమ్ ఎందుకు అరెస్టు చేయడంలేదని ప్రశ్నించారు. నిందితులపై తూతూమంత్రంగా కేసులు నమోదుచేసి, నామమాత్రపు విచారణతో సరిపెడితే డ్రగ్స్ నిర్మూలన సాధ్యపడదని స్పష్టం చేశారు.