KTR | హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫార్మా సిటీ ఏర్పాటు విషయంలో ఎంతో ముందు చూపుతో వ్యవహరించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెట్టి అక్కడ నివాసాలు రాకుండా, 50 ఏళ్ల పాటు ఎలాంటి సమస్య లేకుండా ఫార్మా సిటీని డిజైన్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కొడంగల్‌లో ప్రజల తిరుగుబాటు, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అంశం, రాష్ట్రంలో భూసేకరణ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న దురాగతాలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఫార్మా స్యూటికల్స్, లైఫ్ సైన్సెన్స్ రంగంలో మన హైదరాబాద్ లో ఐడీపీఎల్‌ను అప్పటి ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. ఐడీపీఎల్ సంస్థ ఎంతో మందికి గొప్ప వాళ్లను తయారు చేసింది. రెడ్డి ల్యాబ్ ఓనర్ సహా చాలా మంది ఐడీపీఎల్ నుంచి వచ్చారు.
40 శాతం భారత దేశంలో బల్క్ డ్రగ్స్ ఉత్పత్తి హైదరాబాద్‌లోనే జరుగుతుందని గర్వంగా చెబుతున్నా. కరోనా సమయంలో పారాసిటామల్ టాబ్లెట్స్ కావాలని అమెరికా అధ్యక్షుడు కూడా అడిగారని కేటీఆర్ గుర్తు చేశారు.
హైదరాబాద్ ఫార్మా స్యూటికల్ రంగంలో లీడర్‌గా తయారైంది. దాన్ని మరింత పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు. అదే విధంగా తెలంగాణను ఫార్మా రంగంలో రారాజు చేసేందుకు కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ఫార్మాసిటీ ప్లాన్ చేశారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే మనం పంచాయితీలు పెట్టుకోకుండా తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వానించాలని కేసీఆర్ మాకు చెప్పారని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే చైనాలో జరిగిన వరల్డ్ ఎకానమీ ఫోరమ్ సమావేశానికి కేసీఆర్ వెళ్లారు. చైనా ప్రపంచానికి తయారీ రంగంలో లీడర్ ఎట్ల అయిందని కేసీఆర్ రెండు రోజులు అక్కడే ఉండి పరిశీలించారు. ఒకే చోట 70 వేల ఎకరాల తయారీ రంగం ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి ఎందుకు అక్కడ ఆ విధంగా ఏర్పాటు చేశారో తెలుసుకున్నారు. స్కేల్ ఆఫ్ ఎకానమీ ఉండే విధంగా అన్ని సంస్థలు ఒకే దగ్గర ఉండే విధంగా చేస్తే ప్రయోజనం ఉంటుందని చైనా వాళ్లు కేసీఆర్‌కు చెప్పారు. దీంతో హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత ఫార్మా పారిశ్రామిక వేత్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. వాళ్లు కూడా ఒకే చోట ఫార్మా కంపెనీలు పెట్టాలని కోరారు. దీంతో కేసీఆర్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారు. ముచ్చర్లలో ఫార్మా పార్క్ పెట్టి అక్కడ నివాసాలు రాకుండా, 50 ఏళ్ల పాటు ఎలాంటి సమస్య లేకుండా ఫార్మా సిటీని డిజైన్ చేశారని కేటీఆర్ పేర్కొన్నారు.
మూడు హెలికాప్టర్లలో పారిశ్రామిక వేత్తలను తీసుకెళ్లి ముచ్చర్లలో ఫార్మా సిటీకి ప్లాన్ చేశారు. దాదాపు 8 ఏళ్లు కష్టపడి 14 వేల ఎకరాలను మేము సేకరించాం. అప్పుడు ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టారు. ఫార్మా సిటీ వస్తే మీ ప్రాంతం కాలుష్యం అవుతుందని వాళ్లను రెచ్చగొట్టారు. కానీ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే తుగ్లక్ మాదిరిగా ఏం తెలుసుకోకుండా ఫార్మా సిటీ రద్దు అన్నారని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
BRS | నరేందర్ రెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా.. బీఆర్ఎస్ నాయకుల రాస్తారోకో
Patnam Narender Reddy | డ్యామేజీ కంట్రోల్ కోసమే నన్ను అరెస్టు చేశారు : పట్నం నరేందర్ రెడ్డి
DK Aruna | లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందనుకోవడం లేదు.. రేవంత్ సర్కార్‌పై మండిపడ్డ ఎంపీ డీకే అరుణ