ముంబై, ఫిబ్రవరి 25: దేశీయ స్టాక్ మార్కెట్ల ప్రారంభ లాభాలు ఆవిరైపోయాయి. భారత్‌కు చెందిన సోలార్ ఉత్పత్తులపై 126 శాతం సుంకాన్ని విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించడంతో మదుపరుల్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. ఫలితంగా ఇంట్రాడేలో 600 పాయింట్లకు పైగా లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 50 పాయింట్ల లాభంతో 82,276.07 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 57.85 పాయింట్లు అందుకొని 25,482.50 వద్ద స్థిరపడింది.
ప్రారంభంలో భారీగా లాభపడిన సూచీలకు మధ్యాహ్నం తర్వాత అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు మదుపరులను అమ్మకాల వైపు నడిపించాయని జియోజిట్ ఫైనాన్షియల్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. బ్లూచిప్ సంస్థల షేర్లలో అమ్మకాలు జరగడం కూడా పతనానికి ఆజ్యంపోసింది. ముఖ్యంగా రిలయన్స్ షేరు 2 శాతానికి పైగా పతనం చెందింది.
అలాగే ఎస్బీఐ 2 శాతం, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్ షేర్లు నష్టపోయాయి. కానీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టాటా స్టీల్, టీసీఎస్, ఇండిగో షేర్లు రెండు శాతానికి పైగా బలపడ్డాయి. వీటితోపాటు సన్‌ఫార్మా, మహీంద్రా, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, బీఈఎల్, ఎల్అండ్టీ, మారుతి, పవర్‌గ్రిడ్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ షేర్లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే మెటల్ సూచీ అత్యధికంగా 2.64 శాతం లాభపడగా, ఆటో 1.82 శాతం, కమోడిటీస్ 1.49 శాతం, హెల్త్‌కేర్ 1.35 శాతం, కన్జ్యూమర్ షేర్లు లాభపడగా..టెలికాం, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ రంగ షేర్లు నష్టపోయాయి.
సౌర ఉత్పత్తులపై అమెరికా 126 శాతం దిగుమతి సుంకం విధించనున్నట్టు ప్రకటించడంతో ఈ రంగానికి చెందిన కంపెనీల షేర్లు కుప్పకూలాయి. వారీ ఎనర్జీస్ షేరు 10.47 శాతం నష్టపోగా, ప్రీమియర్ ఎనర్జీస్ 6.27 శాతం, విక్రమ్ సోలార్ 5.45 శాతం, స్టెర్లింగ్ అండ్ విల్సన్ రెన్యువబుల్ ఎనర్జీ 1.05 శాతం చొప్పున పడిపోయాయి.