కొడిమ్యాల, ఫిబ్రవరి 25: కొడిమ్యాల మండలంలో ఆయకట్టేతర గ్రామాలైన తిర్మలాపూర్, సండ్రల్లపల్లి, హిమ్మత్‌రావుపేట, రామ్‌సాగర్, డబ్బుతిమ్మాయిపల్లి సాగునీటికి తండ్లాడుతున్నాయి. వానకాలం వర్షాలతోపాటు బావులు, బోర్ల ఆధారంగా సాగు చేస్తున్నా.. యాసంగిలో పంటలు కాపాడుకోలేక కన్నీళ్లు మిగులుతున్నాయి. అయితే పోతారం రిజర్వాయర్ నుంచి కెనాల్ నిర్మించి నీరందించాలని కొన్నేండ్లుగా రైతులు డిమాండ్ చేస్తుండగా, నాటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కానీ, స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కారు, ఈ ఐదు గ్రామాల సమస్యపై దృష్టి సారించింది. ఎల్లంపల్లి బరాజ్ నుంచి పోతారం రిజర్వాయర్‌కు నీరు వస్తుండగా, అక్కడి నుంచి నీటిని తరలించి 2వేల ఎకరాలకు సాగునీరివ్వాలని ప్రతిపాదనలు చేసింది.
2018లోనే భూ సేకరణ 95 శాతం పూర్తి చేసింది. పోతారం రిజర్వాయర్ నుంచి ఏడు కిలోమీటర్ల గ్రావిటీ కాలువ నిర్మాణానికి 50 నుంచి 60 మంది రైతుల నుంచి భూ సేకరణ పూర్తి చేసి పరిహారం కూడా చెల్లించింది. అయితే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదు. టెండర్ తక్కువ పాడానని, మెటీరియల్ ధరలు పెరిగాయని రద్దు చేసుకోగా.. ఆ తర్వాత కొన్ని కారణాలతో మళ్లీ టెండర్ వేయలేదు. అనంతరం అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. గెలిచిన ఏడాదిలోగా కెనాల్ నిర్మిస్తానని గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిపల్లి సత్యం హామీ ఇచ్చినా.. అది ఆచరణకు నోచలేదు. ఆయన చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచి రెండేళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభించలేలేదు.
ఎమ్మెల్యే మాటిచ్చి తప్పారని రైతులు ఆరోపిస్తున్నారు. వానకాలం సీజన్లో ఐదు గ్రామాల పరిధిలో వెయ్యి ఎకరాలకుపైగా సాగు చేస్తున్నా యాసంగిలో బావులు, బోర్ల మీద ఆధారపడుతున్నా 500 ఎకరాలు కూడా సాగవడం లేదని ఆవేదన చెందుతున్నారు. నడి ఎండల్లో భూగర్భజలాలు అడుగంటి చాలా వరకు పొలాలు ఎండిపోతున్నాయని, వేసిన పంటలు సగం కూడా చేతికి రావడం లేదని కన్నీరు పెడుతున్నారు. ఎమ్మెల్యే మాట నిలబెట్టుకోవాలని, కాలువ పనులు త్వరగా పూర్తి చేయించి సాగునీరందించాలని వేడుకుంటున్నారు. ఈ సమస్యపై ఎల్లంపల్లి ఈఈ సంతుప్రకాశ్ మాట్లాడుతూ.. నూతన కెనాల్ నిర్మాణంతోపాటు పక్క మండలంలో మిగిలిపోయిన కాలువ పనులు పూర్తికి 92.50 కోట్లతో నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపామని చెప్పారు. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. పోతారం రిజర్వాయర్ దగ్గర మూడు నుంచి నాలుగు ఎకరాలు సేకరించాల్సి ఉందని, భూ సేకరణ కోసం ప్రభుత్వానికి విన్నవించామని చెప్పారు.
యాసంగిల నీళ్లు ఎల్లుతలేవు
నాకు ఊళ్లే ఎడెకరాల 50 గుంటల భూమి ఉన్నది. వానకాలంలో మొత్తం భూమి సాగు చేస్త. కానీ, యాసంగిలో నీళ్లు ఎల్లక నాలుగెకరాలల్ల పంటలు వేస్తున్న. తలాపునే నీళ్లు ఉన్నా వాడుకోలేని పరిస్థితి మాది. కెనాల్ కోసం బీఆర్ఎస్ సర్కారు భూ సేకరణ చేసింది. కానీ, పనులు కాలేదు. ప్రభుత్వాలు మారుతున్నా మా పరిస్థితి అలాగేఉంది. ప్రభుత్వ పెద్దలు స్పందించి కెనాల్ నిర్మించి నీరందించాలి.
– డబ్బు గౌతంరెడ్డి, రైతు (డబ్బుతిమ్మాయిపల్లి)
హామీ ఏమైందో ఎమ్మెల్యే చెప్పాలి
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎన్నికల ప్రచారానికి మా ఊరు డబ్బుతిమ్మాయిపల్లికి వచ్చిండు. గెలిచిన ఏడాదిలోగా కాలువ పూర్తి చేసి సాగునీరందిస్తానని హామీ ఇచ్చిండు. కానీ, రెండేండ్లయినా ఇటువైపు రాలే. తట్టెడు మట్టి తీయలే. నాకు పదెకరాల పొలం ఉన్నది. వానకాలం మొత్తం సాగు చేసిన. కానీ ఇప్పుడు బావిలో నీళ్లు ఎల్లే పరిస్థితి లేదు. నాలుగు నుంచి ఐదు ఎకరాలు మాత్రమే పంటేసిన.
– పుండ్ర అమర్నాథ్రెడ్డి, రైతు (డబ్బుతిమ్మాయిపల్లి)