Mobile Phone | మొబైల్ ఫోన్ నేటి జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. చాలా మంది ఫోన్‌ను ఎప్పుడూ తమ దగ్గరే ఉంచుకుంటారు. అయితే ఫోన్‌ను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం ఆరోగ్యపరంగా, భద్రత పరంగా మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో ఫోన్‌ను ఉంచడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, మరికొన్ని సందర్భాల్లో ఫోన్‌కే నష్టం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. చార్జింగ్ చేస్తున్నప్పుడు చాలా మంది ఫోన్‌ను ఛార్జర్పైనే ఉంచుతారు. ఇది సురక్షితమైన అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. అలాగే రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ సామర్థ్యం క్రమంగా తగ్గి, దీర్ఘకాలంలో దాని పనితీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. నిద్రపోయేటప్పుడు దిండు కింద ఫోన్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు. ఫోన్‌కు నోటిఫికేషన్లు వచ్చినప్పుడు స్క్రీన్ వెలుగుతుంది. ఈ కాంతి మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని ప్రభావితం చేసి, నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది.
చాలామంది సౌకర్యం కోసం ఫోన్‌ను వెనుక జేబులో పెట్టుకుంటారు. అయితే ఇలా ఉంచడం వల్ల ఫోన్‌ను కూర్చునేటప్పుడు పగలగొట్టే ప్రమాదం ఉంటుంది. అలాగే ఫోన్ జారిపోవడం లేదా పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలం ఇలా ఉంచడం వల్ల ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ కారణంగా జీర్ణాశయం, కాళ్లలో అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుంది. పురుషులు ఎక్కువగా ఫోన్‌ను ముందు జేబులో పెట్టుకునే అలవాటు కలిగి ఉంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఫోన్‌ను ఎక్కువసేపు ముందు జేబులో ఉంచడం వల్ల పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై, ముఖ్యంగా వీర్యకణాల నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. నిద్రపోయే సమయంలో ఫోన్‌ను తలకు దగ్గరగా ఉంచుకోవడం కూడా మంచిది కాదు. కొన్ని పరిశోధనల్లో రాత్రి సమయంలో ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశంపై అధ్యయనాలు జరుగుతున్నాయి. అందుకే ఫోన్‌ను తలకు దూరంగా ఉంచడం లేదా అవసరమైతే వైర్లెస్ హెడ్సెట్ ఉపయోగించడం మంచిది.
అయితే ఈ అంశంపై క్యాన్సర్ నిపుణులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సెల్‌ఫోన్ రేడియేషన్ చాలా స్వల్ప స్థాయిలోనే ఉంటుంది. జేబులో ఉన్న ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ చర్మాన్ని కూడా పెద్దగా దాటదని, ఇప్పటివరకు అందుబాటులో ఉన్న పెద్ద అధ్యయనాల ప్రకారం ఫోన్ రేడియేషన్ ప్రభావం చాలా తక్కువగా లేదా దాదాపు లేనట్టేనని తెలిపారు. ఈ అంశాలకు సంబంధించి ప్రచారంలో ఉన్న అనేక వాదనలకు స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేవని కూడా చెప్పారు. మొబైల్ ఫోన్ రేడియేషన్ ఆరోగ్యంపై ఎంత మేర ప్రభావం చూపుతుందనే విషయంలో ఇంకా పరిశోధనలు కొనసాగుతున్నాయి. స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, జాగ్రత్తగా ఉండడం మంచిదనే ఉద్దేశంతో ఫోన్‌ను నిద్రపోయే సమయంలో తలకు దూరంగా ఉంచడం, అవసరం లేని సమయంలో శరీరానికి అతుక్కుపోయేలా ఎక్కువసేపు ఉంచకపోవడం, చార్జింగ్ అలవాట్లలో జాగ్రత్తలు పాటించడం వంటి సాధారణ భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది.