దమ్మపేట, ఆగస్టు 07 : విద్యార్థుల్లో దాగి ఉన్న మేధాశక్తి, జ్ఞాపకశక్తి పెంపునకు క్విజ్ పోటీలు దోహదం చేస్తాయని ఐటీడీఏ పీవో బి.రాహుల్ అన్నారు. శుక్రవారం దమ్మపేట మండలం అంకంపాలెం లోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ బాలికల పాఠశాలలో పాఠశాలల స్థాయి క్విజ్ పోటీలు నిర్వహణకు ఆయన ప్రత్యేక అతిథిగా హాజరై మాట్లాడారు. గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆదేశాల మేరకు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల వారీగా 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ క్విజ్ పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థినీ విద్యార్థులను ఒక్కొక్క పాఠశాల నుండి నలుగురు చొప్పున ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 11న ఏటీడీవోల పరిధిలో క్విజ్ పోటీలలో ఎంపికలు జరుగుతాయని ఆ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులను ఎంపిక చేసి ఈ నెల 13న ఐటీడీఏ పరిధిలో జరిగే క్విజ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఐటీడీఏ పరిధిలో జరిగిన క్విజ్ పోటీలలో గెలుపొందిన పాఠశాలలకు పాఠశాల అభివృద్ధి కోసం మొదటి స్థానం, రెండవ స్థానం గెలిచిన పాఠశాలలకు నగదు పురస్కారాలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, దమ్మపేట తాసీల్దార్ మురళి, ఏటీడీవో చంద్రమోహన్, హెచ్ఎం శారద, డిప్యూటీ వార్డెన్ నాగమణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.