CM Vijay : తమిళనాడులో డీఎంకే, ఏఐఏడీఎంకే, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని టీవీకే అధినేత, సీఎం విజయ్ ఆరోపించారు. అదేంటో మాజీ సీఎం స్టాలిన్ ప్రజలకు వివరించాలని విజయ్ డిమాండ్ చేశారు. తమిళనాడులోని మధురాంతకం నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో తన టీవీకేను గెలిపించాలని కోరుతూ నియోజకవర్గంలో విజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రతిపక్షాలైన డీఎంకేతోపాటు ఏఐఏడీఎంకే, బీజేపీపై ఆరోపణలు చేశారు.
డీఎంకేతో, ఏఐఏడీఎంకే, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉంది. మీ మధ్య ఒప్పందం ఏంటి..? తమిళనాడు అడుగుతోంది. స్టాలిన్ సార్.. మీరు ఈ విషయంపై నోరు విప్పాలి. మీతో చేతులు కలిపిన ఏఐఏడీఎంకే కూడా నోరు విప్పడం లేదు. ఈ విషయంలో కూడా మీరు కుమ్మక్కయ్యారా..? ఈ విషయంలో మీ మధ్య ఒప్పందం కుదిరిన తర్వాత నోరు విప్పడం లేదు. ఇలాంటి దుష్ట శక్తులను ఓడించి, ప్రజలు టీవీకేను గెలిపించాలి అని విజయ్ పిలుపునిచ్చారు. గ్రానైట్ వ్యాపారవేత్త ఆర్ వీరమణి పిల్లలను లైంగికంగా వేధించిన కేసులో డీఎంకే అవినీతికి పాల్పడిందని, ఏఐఏడీఎంకేతో కుమ్మక్కైందని విజయ్ ఆరోపించారు.
చాలా ఏళ్లుగా వీరమణి పిల్లలను వేధించాడని, ఈ అంశంపై డీఎంకే హయాంలోనే కేసు నమోదైనప్పటికీ.. నిజాల్ని అప్పటి ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఆరోపించారు. తన తల్లి గురించి వారు తప్పుగా మాట్లాడినప్పుడు కూడా తాను సహించానని, కానీ, తమిళనాడులోని తల్లులు, చెల్లెళ్ల జోలికి వస్తే మాత్రం ఊరుకోబోనని హెచ్చరించారు. ఇక, మధురాంతకం ఉప ఎన్నిక అక్టోబర్ 6న జరగనుండగా.. అక్టోబర్ 9న ఫలితం వెల్లడవుతుంది.