జైపూర్: కొందరు వ్యక్తులు ఒక హాటల్‌కు వెళ్లారు. ఫుడ్ ఆలస్యంపై ఆగ్రహించి హాటల్ నిర్వాహకుడిపై కాల్పులు జరిపారు. గాయపడిన అతడ్ని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తుండగా అది బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి మరణించాడు. (Hotel Operator Shot, Dies In Crash) రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఖర్నాల్ గ్రామంలోని ఒక హోటల్‌కు కొందరు వ్యక్తులు వెళ్లారు. ఆర్డర్ చేసిన ఆహారం ఆలస్యంపై బీహార్‌కు చెందిన హోటల్ నిర్వాహకుడైన 40 ఏళ్ల రామ్‌కుమార్ అలియాస్ రామ్‌దాస్‌తో వారికి వాగ్వాదం జరిగింది. ఈ వివాదం ముదరడంతో ఒక యువకుడు పిస్టల్ తీసి అతడి ఛాతిపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత వారు అక్కడి నుంచి పారిపోయారు.
కాగా, కాల్పుల్లో గాయపడిన హోటల్ నిర్వాహకుడు రామ్‌కుమార్‌ను స్థానికులు తొలుత నాగౌర్‌లోని జేఎల్ఎన్ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాథమిక చికిత్స అనంతరం జోధ్‌పూర్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో అక్కడకు తరలిస్తుండగా ఖిన్వ్సర్ సమీపంలో అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి అది దూసుకెళ్లి బోల్తాపడింది.
మరోవైపు అంబులెన్స్ ప్రమాదం గురించి తెలుసుకున్న ఖిన్వ్సర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో మరింత గాయపడిన హోటల్ నిర్వాహకుడు రామ్‌కుమార్‌ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
అయితే హోటల్లో జరిగిన కాల్పుల సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఫోరెన్సిక్ బృందంతో ఆధారాలు సేకరించినట్లు చెప్పారు. అంబులెన్స్ ప్రమాదంలో మరణించిన హోటల్ నిర్వాహకుడిపై తొలుత కాల్పులకు పాల్పడిన నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.