‘వారణాసి’ సినిమా గురించి దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం జార్జియాలో షూటింగ్‌ను జరుపుకుంటున్నది. తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్ గురించి చిత్ర కథానాయిక ప్రియాంక చోప్రా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆమె ‘వారణాసి’ గురించి మాట్లాడింది. ‘ఇదొక విజువల్ వండర్. కాలంతో పాటు ప్రయాణం చేస్తూ ప్రపంచాన్ని దర్శిస్తాం.
ఈ కథలోని సాహసాలు మిమ్మల్ని అబ్బురపరుస్తాయి. మొత్తంగా గొప్ప సాహస ప్రయాణమిది. ఇప్పటికే 14 నెలలు షూటింగ్ చేశాం. మరో ఆరు నెలల షూటింగ్ బ్యాలెన్స్‌గా ఉంది’ అని ప్రియాంక చోప్రా తెలిపింది. ఆమె మాటలతో సినిమా కాన్సెప్ట్‌పై మరింత స్పష్టత వచ్చిందని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాలోని ఓ ఎపిసోడ్లో హీరో మహేష్‌బాబు..శ్రీరాముడి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచవ్యాప్తంగా ‘వారణాసి’ ప్రేక్షకుల ముందుకురానుంది.