Mysuru : కర్ణాటకలోని మైసూరులో దారుణం జరిగింది. వారాంతపు సెలవులు కూడా ఇవ్వకపోవడం, మానసికంగా వేధించడం వల్ల ఒక మహిళా ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడింది. మేనేజర్ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్లు సూసైడ్ నోట్ కూడా రాసింది. ఈ ఘటన కర్ణాటకలోని, మైసూరులో శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు సమీపంలోని హింకాల్కు చెందిన రాజేశ్వరి అలియాస్ నాగేశ్వరి స్థానికంగా భర్త అశోక్‌తో కలిసి ఉంటోంది. నాగేశ్వరి 7 సంవత్సరాలుగా ఒక సూపర్ మార్కెట్లో పని చేస్తోంది.
ఆ సూపర్ మార్కెట్లోకి ఇటీవల కొత్తగా డాలీ అనే సూపర్వైజర్ చేరాడు. అతడు నాగేశ్వరిని కొంతకాలంగా వేధింపులకు గురి చేశాడు. కొన్ని నెలలపాటు వీకాఫ్స్ కూడా ఇవ్వలేదు. మానసికంగా వేధింపులకు గురి చేశాడు. అలాగే, తను చెయ్యని తప్పుల్ని ఒప్పుకోమని నాగేశ్వరిపై ఒత్తిడి తెచ్చేవాడు. ఇటీవల నాగేశ్వరి అనారోగ్యానికి గురికాగా.. రెండు, మూడు రోజులు డ్యూటీకి వెళ్లలేదు. దీంతో ఆమెను డాలీ.. ఉద్యోగంలోంచి తీసేశాడు. అతడి వేధింపులు, ఉద్యోగం పోవడంతో నాగేశ్వరి తీవ్ర మనస్థాపానికి గురైంది. శుక్రవారం మధ్యాహ్నం తన ఇంట్లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త అశోక్.. నాగేశ్వరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన అతడు ఇంటికొచ్చి చూసేసరికి నాగేశ్వరి అపస్మారక స్థితిలో పడి ఉంది. దీంతో వెంటనే ఆమెను దగ్గర్లోని ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆమె మృతిపై భర్త అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన ఇంటి నుంచి నాగేశ్వరి రాసిన సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. మేనేజర్ డాలీ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నాగేశ్వరి తన లేఖలో పేర్కొంది. దీంతో అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు కోరుతున్నారు.