న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: బ్యాంకులపై సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీమా సహా ఇతర బ్యాంకింగేతర వ్యాపారాలు మీకెందుకంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ముందు బ్యాంకింగ్ కార్యకలాపాలను సవ్యంగా నిర్వహించాలని చురకలంటించారు. ‘బ్యాంకులు తమ పరిధిలోని వ్యాపార కార్యకలాపాలపైనే దృష్టి సారించాలి. బీమా పాలసీల విక్రయంపై బ్యాంకర్లు ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఇది అస్సలు సరికాదు.
బ్యాంకింగ్, ఇన్సూరెన్స్.. ఈ రెండింటికీ వేర్వేరు రెగ్యులేటర్లున్నారు. బ్యాంకులు బీమా వ్యాపారంపై దృష్టి పెట్టడం.. ఆర్బీఐ, ఐఆర్డీఏఐల మధ్య ఇరుక్కున్నట్టే అవుతుంది’ అని ఇక్కడ ఆర్బీఐ సెంట్రల్ బోర్డును ఉద్దేశించి నిర్వహించిన బడ్జెట్ అనంతర సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ మంత్రి సీతారామన్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ నెల 11న బీమా సహా మరికొన్ని బ్యాంకింగ్ వ్యాపారాలపై ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేయడాన్ని మంత్రి స్వాగతించారు. ఆమోదించిన పాలసీ ప్రకారం పాలసీదారులు బ్యాంకుల తప్పిదాల వల్ల నష్టపోతే.. పాలసీ కోసం చెల్లించిన మొత్తం సొమ్ముతోపాటు నష్టపరిహారాన్ని కూడా చెల్లించాలని సదరు గైడ్‌లైన్స్‌లో రిజర్వ్ బ్యాంక్ పేర్కొన్నది.
ఈ మార్గదర్శకాలపై మార్చి 4కల్లా అభిప్రాయాలను తెలుపవచ్చన్న ఆర్బీఐ.. జూలై 1 నుంచి తప్పుడు వ్యాపార విధానాలపై కఠిన నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కాగా, అవసరమైన బీమా రక్షణ ఉన్నప్పటికీ.. బ్యాంకులు తమ కస్టమర్లను మళ్లీ బీమా పాలసీలను కొనాలని అడుగుతున్నాయని, ఆర్బీఐ ఈ రకమైన వాటికి బాధ్యత వహించబోదని.. బీమా అనేది ఐఆర్డీఏఐ నియంత్రణ కిందకు వస్తుందని మంత్రి గుర్తుచేశారు. కానీ బ్యాంకులు బీమాలను అమ్మడం వల్ల నియంత్రణపరమైన ఇబ్బందులతో కస్టమర్లు నలిగిపోతున్నారని చెప్పారు. కాబట్టి బ్యాంకులు.. డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు వంటివి చూసుకోవాలని హితవు పలికారు.
ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనానికి సంబంధించి ఎటువంటి ప్రణాళికలు ప్రభుత్వం వద్ద లేవని మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు. అయితే వికసిత్ భారత్ కోసం ఇటీవలి బడ్జెట్ (2026-27)లో ప్రతిపాదించిన బ్యాంకింగ్‌పై ఉన్నతస్థాయి కమిటీ ఈ అంశాన్ని పరిశీలిస్తుందనడం గమనార్హం. ఇప్పటికే మోదీ సర్కార్ అనేక బ్యాంకులను ఇతర ప్రభుత్వ బ్యాంకుల్లో విలీనం చేసిన విషయం తెలిసిందే. ఎస్బీఐలో దాని అనుబంధ బ్యాంకుతోపాటు భారతీయ మహిళా బ్యాంక్ నూ కలిపేశారు. దీంతో ఇప్పుడు దేశంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులే ఉన్నాయి. ఈ సంఖ్యనూ తగ్గించాలని చూస్తున్నారు.
ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారం కొనడం వల్లే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇక భారతీయ మార్కెట్లో అక్షయ తృతీయ తదితర పండుగల సీజన్లోనే అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని, గోల్డ్ డిమాండ్ కనిపిస్తుందని చెప్పారు. నిజానికి భారతీయులు ఎల్లప్పుడూ బంగారాన్ని ఇష్టపడుతారని, ఇప్పుడు తమకు ఎంతో నచ్చిన పెట్టుబడి సాధనంగానూ చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇదిలావుంటే దేశంలోకి వస్తున్న పసిడి దిగుమతులు ఆందోళనకర స్థాయిలో లేనప్పటికీ.. అటు ప్రభుత్వం, ఇటు ఆర్బీఐ రెండూ నిశితంగానే గమనిస్తున్నాయని స్పష్టం చేశారు. కాగా, గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ వ్యవధిలో భారత్‌లోకి బంగారం దిగుమతులు విలువపరంగా 1 బిలియన్ డాలర్లు పెరిగి 50 బిలియన్ డాలర్లకు చేరాయి.
వివిధ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా విధిస్తున్న ప్రతీకార సుంకాలకు వ్యతిరేకంగా ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిన నేపథ్యంలో భారత్‌పై వేసిన సుంకాల్లో మార్పులపట్ల ఇప్పుడే స్పందించలేమని మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. వాణిజ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న అన్ని పరిణామాలను దగ్గరగా గమనిస్తున్నదని చెప్పారు.