మంచిర్యాల, జూన్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడిచే మైనార్టీ గురుకులాల వ్యవస్థ గాడి తప్పిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. అరకొర వసతులు, సవాలక్ష సమస్యలకు నిలయాలుగా మారిన గురుకులాల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కీలకమైన బాధ్యతలు అనర్హులకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం అర్హులైన ముగ్గురు రెగ్యులర్ ప్రిన్సిపాల్స్ ఉన్నప్పటికీ, నిర్మల్-ఆదిలాబాద్ జిల్లాలకు ఆర్ఎల్సీ బాధ్యతలను ఒక కాంట్రాక్ట్ ఉద్యోగికి అప్పగించారు.
ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో రెగ్యులర్ ప్రిన్సిపాల్స్, సీనియర్ రెగ్యులర్ ఉద్యోగులను కాదని జూనియర్ ఉద్యోగిగా ఉన్న ఓ పీజీటీ(ఇంగ్లిష్) ఉద్యోగికి ఆర్ఎల్సీ బాధ్యతలు అప్పగించారు. దీనిపై ఆ శాఖలో పని చేస్తున్న అర్హులైన ప్రిన్సిపాల్స్, సీనియర్ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేసున్నారు. మమ్ములను కాదని ఔట్సోర్సింగ్, జూనియర్ ఉద్యోగులకు ఆ బాధ్యతలు అప్పగించడం మమ్ములను అవమాన పరచమే, వ్యవస్థను తప్పుతోవ పట్టించడమే అంటూ వాపోతున్నారు. ఆర్ఎల్సీ పోస్టులకు అర్హత కలిగిన రెగ్యులర్ ప్రిన్సిపాల్స్‌ను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒకవేళ జిల్లాలోని ఉద్యోగులను నియమించడం సాధ్యం కాకపోతే, ప్రిన్సిపాల్ పోస్ట్ రాష్ట్ర స్థాయి(స్టేట్ కేడర్) పోస్టు అయినందున, రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని రెగ్యులర్ ప్రిన్సిపల్స్‌ను ఇక్కడ ఆర్ఎల్సీలుగా నియమించాలంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం జరిగిన ఆర్ఎల్సీ నియామకాలను పునఃపరిశీలించి, సీనియార్టీ పరిపాలన ప్రమాణాల ప్రకారం రెగ్యులర్ ప్రిన్సిపాల్స్‌కు ఆప్పగించాలని కోరుతున్నారు. గాడితప్పిన మైనార్టీ గురుకులాల వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఆ శాఖ ఉద్యోగులు సిద్ధమైన నేపథ్యంలో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
జీరో రిజల్ట్ నమోదైన పాఠశాల ఇన్చార్జే.. ఇప్పుడు రెండు జిల్లాల ఆర్ఎల్సీ..
ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో కాగజ్‌నగర్ మైనార్టీ బాయ్స్-2 గురుకులానికి సంబంధించి పరీక్ష రాసిన విద్యార్థులందరూ ఫెయిల్ అయ్యారు. రాష్ట్రంలోనే జీరో రిజల్ట్ నమోదు చేసిన మైనార్టీ స్కూల్ ఇదొక్కటే. కాగా.. ప్రస్తుతం ఆ పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపల్‌గా పనిచేసిన జూనియర్ ఉద్యోగిని మంచిర్యాల-ఆసిఫాబాద్ జిల్లాల ఆర్ఎల్సీగా నియమించడం అగ్గిరాజేసింది. నిబంధనల ప్రకారం రెండు జిల్లాల్లో ఉన్న రెగ్యులర్ ప్రిన్సిపల్స్ లేదా రెగ్యులర్ జేఎల్స్లో ఎవరో ఒకరికి ఆర్ఎల్సీగా బాధ్యతలు అప్పగించాలి.
అర్హులైన వారిని కాదని ఇన్చార్జి ప్రిన్సిపల్‌గా వ్యవహరిస్తున్న ఓ పీజీటీకి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఇన్చార్జిగా ఉన్న స్కూల్లోనే తన విధులు సరిగా నిర్వహించకపోవడంతో విద్యార్థులు ఫెయిలయ్యారని, అలాంటి జూనియర్ ఉద్యోగికి రెండు జిల్లాల బాధ్యత ఎలా ఇస్తారంటూ ఆ శాఖ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాలోనూ ఇదే తరహాలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగికి ఆర్ఎల్సీ బాధ్యతలు ఇచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సెక్రటరీ ఆదేశాలు బేఖాతర్ వెనుక మతలబేంటీ..
చెన్నూర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలను మందమర్రిలోని మహిళ డిగ్రీ అండ్ పీజీ కాలేజీకి మార్చాలని టీజీఎంఆర్ఈఐఎస్(తెలంగాణ మైనార్టీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ) సెక్రటరీ మే 15వ తేదీన ఆదేశాలు ఇచ్చారు. కానీ పాఠశాలలను తరలించకుండా జిల్లా ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నాయకుడిని సంబంధించిన బిల్డింగ్‌లో చెన్నూర్‌లో స్కూల్, కాలేజీలు నడుస్తుండడంతో వాటిని షిప్ట్ చేయాలన్న ఆదేశాలను తుంగలోకి తొక్కుతున్నారని తెలిసింది.
ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో ఆమ్యాయాలు అధికారులకు ముడుతుండడంతో బిల్డింగ్ మార్పునకు జిల్లా అధికారి ససేమిరా అంటున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం స్కూల్, కాలేజీ ఒకే దగ్గర ఉండాలి. చెన్నూర్ స్కూల్ ఒక దగ్గర, కాలేజీ ఒక దగ్గర ఉన్నాయి. స్కూల్ పక్కనే శ్మశానవాటిక ఉండడంతోపాటు అక్కడే ఎరువుల దుకాణం నిర్వహిస్తున్న నేపథ్యంలో పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం బిల్డింగ్‌లో వెంటిలేషన్ సరిగా లేదు. పిల్లలకు అవసరమైన ప్లే గ్రౌండ్ లేదు.
నిత్యం డ్రైనేజీ వాటర్ లీకేజీతో పాఠశాల పరిసరాల్లో దుర్గంధం అలముకుంటుందన్న ఫిర్యాదుల నేపథ్యంలో.. మందమర్రికి మార్చాలని సెక్రటరీ ఆదేశించారు. ఉన్నతాధికారి ఆదేశాల మేరకు ఇప్పటికే మందమర్రికి తరలించాల్సిన పాఠశాలను తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక మతలబేంటని ఆ శాఖలో పని చేసే ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల్లో మైనార్టీ గురుకులాల వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం
ఉమ్మడి జిల్లాలోని మైనార్టీ పాఠశాలలు, గురుకులా లు కొందరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పెత్తనం నడుస్తున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థుల అడ్మిషన్లు మొదలు ఉపాధ్యాయులు, ఉద్యోగు లు చివరకు వార్డెన్ల నియామకం వరకు అన్ని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కనుసన్నల్లోనే జరుగుతాయని తెలుస్తున్నది. 2020లో ఉమ్మడి జిల్లాలో ఓ ఆర్ఎల్సీ దగ్గర డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేసిన ఉద్యోగిని అప్పుడున్న మైనార్టీ గురుకుల పాఠశాలల సెక్రటరీ విధుల నుంచి తొలగించారు.
అనంతరం పాఠశాలల్లో జరిగే అవినీతిపై ఉన్నతాధికారులకు నిత్యం ఫిర్యాదులు చేస్తుండడంతో విధిలేక తిరిగి ఆ ఉద్యోగిని విధుల్లోకి తీసుకున్నారు. అప్పటికే ఆ ఆర్ఎల్సీ దగ్గర ఓ డేటా ఎంట్రి ఆపరేటర్ ఉన్నప్పటికీ రెండో వ్యక్తిని అదే పోస్టులో నియమించారు. ఒక పనికి ఇద్దరికి జీ తాలు ఇస్తున్నారు. ఇలా తొలగించినా తిరిగి పట్టుబట్టి మరీ విధుల్లోకి వచ్చిన సదరు డేటా ఎంట్రీ ఆపరేటర్ గురుకుల పాఠశాలల్లో చక్రం తిప్పుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో కీలకమైన పోస్టింగ్‌లు ఆ యన కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, అందుకే అ ర్హులకు కాకుండా అనర్హులకు బాధ్యతలు అప్పగించి, వ్యవస్థనే తప్పుతోవ పట్టిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.