Head of Forest Force : అటవీ శాఖలో డిప్యుటేషన్ పోస్టులకు సంబంధించి ఇటీవల కొన్ని పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన కథనాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని అటవీ దళాల అధిపతి వినయ్ కుమార్ (Vinay Kumar) స్పష్టం చేశారు. ఖాళీగా ఉన్న 15 డిప్యుటేషన్ పోస్టుల్లో 7 పోస్టులు జిల్లా స్థాయికి సంబంధించినవని, వాటి నియామకాల వ్యవహారాన్ని సంబంధిత జిల్లా డీఎఫ్వోలు, కన్జర్వేటర్స్ నిర్వహిస్తారని ఆయన వెల్లడించారు. మిగిలిన పోస్టుల్లో రెండు పోస్టులను యథాతథంగా కొనసాగించగా, మరికొన్ని పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలన కోసం పంపినట్లు వినయ్ కుమార్ వివరించారు.
వాస్తవ పరిస్థితులు ఇలా ఉండగా.. ఈ వ్యవహారాన్ని ప్రధాన అటవీ సంరక్షణాధికారి (PCCF)తో ముడిపెట్టి, ప్రభుత్వం–అటవీ శాఖ మధ్య దూరం పెరిగేలా ఊహాజనిత కథనాలు ప్రచురించడం సమంజసం కాదని వినయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజల్లో అపోహలు కలిగించే నిరాధార కథనాలను ప్రచురించకుండా, వాస్తవాలను నిర్ధారించుకుని మాత్రమే వార్తలను ప్రచురించాలని ఆయన సంబంధిత మీడియా సంస్థలను కోరారు.