Lok Sabha : నీట్ పేపర్ లీకేజీ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ అంశంపై దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో కొత్త బిల్లును కేంద్రం రూపొందించిన సంగతి తెలిసిందే. దీనికి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఈ బిల్లు సోమవారం పార్లమెంట్ ముందుకు రానుంది.
పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్ 2026 పేరుతో రూపొందిన బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెడతారు. దీనిద్వారా ఇప్పటికే అమలులో ఉన్న పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు సవరణలు చేస్తారు. ఈ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆమోదం పొందేలా సభలో హౌజ్ మోషన్ కూడా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. పేపర్ లీకేజీకి సంబంధించి ఇప్పటికే ఉన్న శిక్షలను కొత్త చట్టం ద్వారా మరింత కఠినంగా మార్చనున్నారు. గరిష్ట శిక్షలు, భారీ జరిమానాలు, వేగవంతమైన విచారణలకు ఈ చట్టం ప్రాధాన్యం ఇస్తుంది.
కొత్త చట్టం ద్వారా నిందితులకు పదేళ్ల వరకు జైలుశిక్ష, రూ.10 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. నీట్ పేపర్ లీకేజీతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీలో సీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలు దేశాన్ని కదిలించాయి. చివరకు కేంద్రం దిగివచ్చి, ఆందోళనకారుల డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చింది.