ఖలీల్‌వాడి, జూన్ 3: కేసీఆర్ 14 ఏండ్లు పోరాటం చేసి చివరికి ప్రాణాలకు తెగించి సాధించిన తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. అలాంటి తెలంగాణను వ్యతిరేక శక్తుల నుంచి కాపాడుకోవడానికి కేసీఆరే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బలం పుంజుకుంటేనే రాష్ట్ర ఉనికి కాపాడబడుతుందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, ‘సర్’పై అవగాహన, నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి వేములతోపాటు సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ షిండే, జాజాల సురేందర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అద్భుతమైన అభివృద్ధిని కాంగ్రెస్, బీజేపీ నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు.ప్రజల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ తన సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని ధ్వజమెత్తారు.

గతంలో బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్న సమయంలో జిల్లా ప్రజల అవసరాల కోసం మెయిన్ రోడ్డుపై, రైల్వేస్టేషన్ సమీపంలోని ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయ స్థలాన్ని కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం ఎంపిక చేశారని గుర్తుచేశారు. ఆనాడు ఆర్టీసీ బోర్డు మీటింగ్‌లో రూ.20 కోట్ల నిధులతో అత్యాధునిక బస్టాండ్ నిర్మించాలని ప్రతిపాదనలు కూడా ఆమోదించారని తెలిపారు. కానీ నేడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కోట్ల రూపాయల విలువైన ఆ బస్టాండ్ స్థలాన్ని ప్రజల అవసరాలకు కాకుండా వారి పార్టీ ఆఫీస్ కోసం కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి కిరాయిల ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి కేటాయించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు.
కేసీఆర్, కేటీఆర్ సహకారంతో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా నిజామాబాద్ నగర రూపురేఖలను మార్చేశారని తెలిపారు. నాలుగు లేన్ల రోడ్లు, సుందరమైన పార్కులు, అత్యాధునిక స్మశాన వాటికలు, నూత న కలెక్టరేట్, ఐటీ హబ్, ట్యాంకు బండ్లను నిర్మించి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారని పేర్కొన్నారు. మాధవనగర్ ఆర్వోబీకి కేంద్రం రూ.30 కోట్లు ఇస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.63 కోట్లు కేటాయించిందని, కానీ మొత్తం నిధులు కేంద్రమే ఇచ్చిందంటూ బీజేపీ అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పనులు వేగంగా కొనసాగితే, ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నా ఈ పనులు పూర్తిగా మూలపడ్డాయన్నారు.
మహిళలకు రూ.2500, పింఛన్ల పెంపు, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేయడంలేదని మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా నెలలోనే నిలిపివేశారని తెలిపారు. రెండున్నరేండ్లుగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు నిజామాబాద్‌కు నయా పైసా పని చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి వార్డులో విజయవంతం చేయాలని వేముల కోరారు. సర్ కార్యక్రమం ద్వారా అర్హులైన మన ఓట్లు తొలగిపోకుండా చూసుకోవాలని, ప్రతిపక్షాల ఓట్లను తొలగించేలా ప్రభుత్వాలు పని చేస్తాయని బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండి వారి కుట్రలను అడ్డుకోవాలని వేముల పిలుపునిచ్చారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే పవన్‌కళ్యాణ్ ఇక్కడ సభ నిర్వహించడంపై వేముల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే బాధపడి 11 రోజులు అన్నం తినని పవన్ కళ్యాణ్ ఇవాళ మన గడ్డపైకొచ్చి పునఃనిర్మాణంపై మాట్లాడడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. సరిగ్గా రాజధానిని, సెక్రటేరియట్‌ను కూ డా కట్టుకోలేని వారు మన తెలంగాణకు వచ్చి పునఃనిర్మాణం చేస్తారా అని ప్రశ్నించారు. డిక్షనరీలో తెలంగాణ పదమే లేదన్న బక్కని నర్సింహులు వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి లాంటి నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సమావేశంలో బీఆర్ ఎస్ నాయకులు రవీందర్, నీతూకిరణ్, ప్రభాకర్, రా జు, సత్యప్రకాశ్, సుజిత్‌సింగ్ ఠాకూర్, నవీద్, ఇక్బాల్ పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డిది కుంభకోణాల ప్రభుత్వమని వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్ డిస్కంను మూడు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం వెనుక వేల కోట్ల కుంభకోణం దాగి ఉన్నదని ఆరోపించారు. ఫ్యాక్టరీలు, కమర్షియల్, గృహావసరాలకు సంబంధించి ఆదాయం వచ్చే డిస్కంలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి వేల కోట్లు దోచుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పథకం వేసిందన్నారు. ఆదాయం లేని, బిల్లులు రాని రైతు వ్యవసాయ కనెక్షన్లు, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లను కలిపి రైతు డిస్కంగా మారుస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో రైతులకు ఉచిత కరెంట్ అందకుండా చేసి వ్యవసాయ రంగాన్ని నిలువునా ముంచేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఈ వేల కోట్ల కుంభకోణాన్ని ప్రజలందరికీ వివరించి కాంగ్రెస్ గుట్టు రట్టు చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు వేముల పిలుపునిచ్చారు.
‘సర్’ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ బూత్ ఏజెంట్లు, బూత్ ఇన్చార్జిలు చురుగ్గా వ్యవహరించాలి. ఓటరు జాబితాల్లో ఎలాంటి లోపాలు, పొరపాట్లు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా కృషి చేయాలి. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. సభ్యత్వ నమోదును ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించాలి. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుంది. అభివృద్ధి చేస్తానని చెప్పి అన్ని విధాలా నగరాన్ని చెత్తకుప్పలా తయారుచేసిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ, ఆంధ్రప్రజల మధ్య బీజేపీ, చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్న పవన్‌కళ్యాణ్ వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వ వైఫల్యాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేలా పని చేయాలి.
– బిగాల గణేశ్‌గుప్తా, అర్బన్ మాజీ ఎమ్మెల్యే
సభ్యత్వ నమోదు సందర్భంగా ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ శక్తిగా పని చేయాలి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదేండ్లలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారు. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు. ఆరు గ్యారెంటీలు దేవుడేరుగు..ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయలేదు. రైతులను నిండా ముంచా రు. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు లేవు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రైతన్నలు బాగుంటారు. తెలంగాణపై ఆంధ్ర పెత్తందారులు కండ్లు పెట్టుకుని చూస్తున్నారు. ఉద్యమ సమయంలో ఇండ్లలో పడుకొని తెలంగాణ రావొద్దని కోరుకున్న వ్యక్తులు ఈ రోజు తెలంగాణలో అడుగు పెట్టాలని చూస్తున్నారు. ఖబడ్దార్ పవన్ కళ్యాణ్.. నీ ఆటలు తెలంగాణలో సాగవు.
-బాజిరెడ్డి గోవర్ధన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే
ఢిల్లీని కదిలించి మెప్పించి తెలంగాణ తెచ్చిన వీరుడు కేసీఆర్. తెలంగాణ ఉద్యమం చేసేటప్పుడు పీసీసీ, ఇతర నాయకులందరూ ఎక్కడ ఉన్నారు? కర్త, కర్మ, క్రియ తెలంగాణకు అన్ని కేసీఆరే. ఆయన లేకుంటే తెలంగాణ వచ్చేదేనా?. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి లేకుంటే తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్పై మాట్లాడుతున్నాడు..దమ్ముంటే బీజేపీ మీద మాట్లాడాలి. కేంద్రం నుంచి నిధులు తెచ్చేలా చూసుకో… నీ బాస్ చంద్రబాబు అని నీకు తెలియదా… తెలంగాణలో అభివృద్ధి చేసింది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే.. రెండున్నరేండ్లు గడిచినా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క అభివృద్ధి పని చేయలేదు. వడ్లను కొనకుండా రైతన్నల నడ్డి విరుస్తున్నది. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమికొట్టేలా చూసుకోకండి. బీఆర్ఎస్ కార్యకర్తలంటే వ్యక్తులు కాదు.. శక్తులు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతన్నలకు పెద్దదిక్కుగా కేసీఆర్ ఉన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కాంగ్రెస్ ప్రభుత్వంలో వడ్లు కొనుగోలు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రాబోవు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కేసీఆర్ సీఎం కావాలంటే నిజామాబాద్ అర్బన్‌లో గణేశ్‌గుప్తా ఎమ్మెల్యేగా గెలవాలి. దానికి ప్రజలందరూ ఓటేసి గెలిపించాలి. నగరం ఎంతో అభివృద్ధి చెందింది. ఎట్లుండే నిజామాబాద్ ఇప్పుడెలా ఉందో ప్రజలు గమనించాలి. బీఆర్ఎస్ అధికారంలోకి రాక ముందు ఎలా ఉండేది. ప్రస్తుతం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. కేసీఆర్ ప్రభు త్వం రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్, అనేక సదుపాయాలు కల్పిస్తుంటే, ఇప్పుడు అలాంటివి మరిచిపోయి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి.
-హన్మంత్‌షిండే, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే
ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కింది
కేసీఆర్ పదేండ్ల పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కి ప్రజలను మోసం చేసింది. ఇప్పటివరకు మక్కజొన్నకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా చోద్యం చూస్తున్నది. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది.
-జాజాల సురేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే
సభ్యత్వ నమోదును పారదర్శకంగా నిర్వహించాలి. సభ్యత్వం తీసుకున్న ప్రతిఒక్కరూ కేసీఆర్ కుటుంబంలాగే ఫీల్ అవ్వాలి. మన కుటుంబం, మన తెలంగాణ, మన కేసీఆర్ అనే విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలి. రాష్ర్టాన్ని కేసీఆర్ దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంచారు. అందులో ప్రతి జిల్లాకు సమీకృత కలెక్టరేట్లు నిర్మించిన ఘనత ఆయనదే. ఒక కొత్త సచివాలయాన్ని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసేలా కొందరు వ్యక్తులు సభలు నిర్వహించుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరముంది. ఉద్యమ సమయంలో పవన్‌కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు?.
– రవీందర్‌సింగ్, నిజామాబాద్ అర్బన్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి
బీఆర్ఎస్ సభ్యత నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని సభ్యత్వ నమోదును విజయవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్రంలో కేసీఆర్ పాలన లేకుంటే రైతన్నలు ఆగమవుతున్నారు. రైతుబంధు, రైతు బీమా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతన్నల నడ్డి విరుస్తున్నది. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా, వడ్లు కొనకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి గింజనూ కొనుగోలుచేశారు. రెండు పంటలకు రైతుబంధును అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదే. తెలంగాణను దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉంచిన ఘనత ఆయనదే. అభివృద్ధికి మారుపేరు కేసీఆర్.
-వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ