ఖలీల్‌వాడి, జూన్ 3 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. నిజామాబాద్‌కు చెందిన మమత అనే మహిళకు కాలి భాగంలో దీర్ఘకాలంగా గాయం మానకపోవడంతో జీజీహెచ్‌లోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు వైద్యురాలు శివాని తెలిపారు.
ఈ శస్త్రచికిత్సను విభాగాధిపతి విజయ్‌కుమార్, దవాఖాన సూపరింటెండెంట్ నాగమోహన్ పర్యవేక్షణలో నిర్వహించినట్లు పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం రోగి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడి, గాయం మానిపోయినట్లు చెప్పారు. ఈ చికిత్స ద్వారా రోగి కాలును సంరక్షించడంతో పాటు సాధారణ జీవన విధానానికి తిరిగి చేరుకునే అవకాశం కలిగిందని తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోని ‘ఆధునిక ప్లాస్టిక్ సర్జరీ’ ద్వారా రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.