Festivals | తెలంగాణ విద్వత్సభ.. రాబోయే తెలుగు సంవత్సరమైన శ్రీ ప్లవంగనామ సంవత్సర పండుగల తేదీలను నిర్ణయించింది. ఈ నెల 1, 2 తేదీల్లో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో తెలంగాణ విద్వత్సభ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన విద్వత్సమ్మేళనంలో తెలంగాణకు చెందిన దాదాపు 100 మంది సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష-ధర్మశాస్త్ర పండితులు పాల్గొన్నారు. రాబోయే సంవత్సరానికి (2027-2028) సంబంధించిన పండుగలు, పర్వదినాల గురించి ఈ సమ్మేళనంలో చర్చించి తేదీలను నిర్ణయించారు.
విద్వత్సభ సమ్మేళనంలో నిర్ణయించిన పండుగలు, పర్వదినాల జాబితాను తెలంగాణ విద్వత్సభ ప్రతినిధులు.. ప్రభుత్వ ప్రముఖులకు అందజేశారు. రాష్ట్ర ప్రజలందరికీ పండుగల తేదీలను స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో కచ్చితమైన తేదీలను నిర్ణయించామని, ఈ పండుగలు, తేదీలతో కూడిన జాబితాను మీడియా ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయించాలని కోరుతూ ముఖ్యమంత్రికి కూడా లేఖ రాశారు. తెలంగాణ విద్వత్సభ నిర్ణయించిన పండుగల తేదీలకు సంబంధించిన జాబితాను కింద జతపర్చిన పీడీఎఫ్‌లో చూడవచ్చు..